దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం నుంచి నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఏవైపున చూసిన కన్నీటిగాథలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కరోనా వల్ల కడుపుకోతలు ఎక్కువవుతున్నాయి. తాజాగా చిన్ననాటి నుంచి ఓ చెల్లిని ఆడించి పెంచిన అన్న తుదిశ్వాస విడిచాడు. ఆమెను ఒంటరిదాన్ని చేశాడు. చివరికి ఆ చెల్లే తన అన్నకు తలకొరివి పెట్టాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన నరెడ్ల మల్లేశ్, రాధ దంపతులకు వెంకటేష్, శరణ్య పిల్లలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం మల్లేశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య రాధ 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతోనే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ క్రమంలో అన్నాచెల్లెలు ఇద్దరూ కలిసి వెల్గటూరు మండలం స్తంభంపల్లిలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. అమ్మమ్మ ఇంట్లో ఇద్దరూ అల్లారుముద్దుగా పెరిగారు. శరణ్య ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అన్నీ తానై అన్న చెల్లెలికి కొండంత బలంగా నిలిచాడు. ఇలాంటి తరుణంలో ఓ దారుణ ఘటన వారి జీవితాలను అతలాకుతలం చేసేసింది.
20 ఏళ్లున్న వెంకటేష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. దానికితోడు కరోనా వచ్చి తీవ్ర అనారోగ్యపాలయ్యాడు. ఊపిరితిత్తులు బాగా చెడిపోవడం వల్ల మందులు వాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్న క్రమంలో కరోనా వచ్చి ఆ కుటుంబాన్ని కన్నీటిపాలు చేసింది. కరోనాతో అన్న మృతిచెందాడు. అసలే తల్లిదండ్రులు కోల్పోయిన చెల్లెలికి అన్నే ఒక్కగానొక్క దిక్కు. ఆ అన్నను కూడా కోల్పోయిన చెల్లెలు శరణ్య ఒంటరిగా మిగిలిపోయింది. ఇటువంటి సమయంలో అన్న దహనక్రియలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. తన అన్న మృతదేహానికి తానే అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరింత సమాచారం తెలుసుకోండి: