"మోడీ అసమర్థ"... కౌంటర్ ఇచ్చిన విదేశాంగ మంత్రి..!

Suma Kallamadi
గురువారం రోజు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌.. భారత రాయబారులు, హైకమిషనర్లతో కలిసి వర్చువల్ మీటింగ్ లో సమావేశమయ్యారు. అంతర్జాతీయ మీడియాలో వెల్లువెత్తుతున్న "ఏకపక్ష" కథనాల గురించి ఆయన చర్చించారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రికలైనా న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, స్ట్రెయిట్ టైమ్స్ తో పాటు అనేక టీవీ ఛానల్స్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసమర్థ పాలనతో కోవిడ్ -19 సెకండ్ వేవ్ ను కంట్రోల్ చేయలేక దేశ ప్రజలను స్మశాన వాటికల వద్ద బారులు తీరేలాగా చేశారని ఏకిపారేస్తున్న విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘమైన ఎలక్షన్లు నిర్వహించడంతోపాటు కుంభమేళా కి పర్మిషన్ ఇచ్చినందు వల్ల భారత దేశ ప్రజలు ఆస్పత్రుల ఎదుట దయనీయమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని.. ఢిల్లీ స్మశానవాటికలు మృతదేహాలతో నిండిపోయాయని ఫోటోలు, వీడియోలు ప్రసారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని అంతర్జాతీయ మీడియా తీవ్రంగా నిందిస్తోంది.
ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రి అత్యవసరంగా వర్చువల్ మీటింగ్ పెట్టి అంతర్జాతీయ మీడియాపై ఆగ్రహం వెళ్లగక్కారు. నెగిటివ్ మీడియా ప్రసారాల ప్రభావానికి ఎవరూ కూడా గురికావద్దని.. స్వచ్ఛందంగా చొరవ తీసుకుని భారత ప్రభుత్వం కట్టడికై చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి తెలియజేసేలా చర్యలు చేపట్టాలని జైశంకర్‌ రాయబారులకు సూచించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా ఫస్ట్ వేవ్ ని నియంత్రించలేక పూర్తిగా విఫలమయ్యాయని.. సెకండ్ వేవ్ విజృంభిస్తుందని ఏ వైద్య నిపుణుడు ఊహించలేదని.. కరోనా నియంత్రణలో భారతదేశం ఒక్కటే విఫలమయిందని చెప్పడం సరి కాదని ఆయన సమావేశంలో చెప్పుకొచ్చారు.
ఎలక్షన్లు, ఎలక్షన్ల ప్రచారానికి.. కరోనా కేసులు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని అంతర్జాతీయ మీడియాకి తెలపాలని భారత రాయబారులకు జైశంకర్ చెప్పారు. ఎన్నికలు నిర్వహించని న్యూఢిల్లీ, మహారాష్ట్రలో మాత్రమే అధికంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఎన్నికల నిర్వహించిన రాష్ట్రాల్లో చాలా తక్కువ నమోదు అవుతున్నాయని.. అందువల్ల ఎన్నికలే కరోనా వ్యాప్తి పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో కరోనా పోరుపై భారత దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎలా సరఫరా చేయాలో రాయబారులు అడిగి తెలుసుకున్నారు. అయితే అంతర్జాతీయ మీడియా కుంభమేళ గురించి రాస్తున్న కథనాల గురించి ఈ సమావేశంలో ఎవరూ చర్చించలేదు. అలాగే వ్యాక్సిన్ మైత్రి పేరిట 66 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిన విషయం గురించి కూడా చర్చకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: