కేసీఆర్ ఊచకోత ఇంకా ఉందా..? సీఎంఓలో చీడ పురుగుల ఏరివేత !
సీఎంఓలో వివిధ క్యాటగిరీలలో పని చేస్తున్న ఉద్యోగుల అక్రమార్జనపై కేసీఆర్ టీమ్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు,పార్టీ నాయకుల వ్యవహారాల్లో తల దూర్చడం, ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి పేరును వాడడం, ముఖ్యమంత్రి చెప్పారు అని అధికారులు, ప్రజాప్రతినిధులకు 'ఆదేశాలు 'ఇవ్వడం, ఇష్టారాజ్యంగా పైరవీలు చేయడం, హైదరాబాద్ నుంచి దాదాపు 150, 200 కిలోమీటర్ల పరిధిలో విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వంటి దందాలు చేస్తున్నవారికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇలాంటి దందాలు చేసే వారి సమాచారం తెలుసుకున్న కేసీఆర్ గరం గరంగా ఉన్నారట. ఇక ఎవరినీ ఉపేక్షించరాదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ 'మూడో కన్ను'తెరచినందున అక్రమాలకు పాల్పడుతున్న వారు గజగజ వణుకుతున్నారు. సీఎంఓకు 'క్లీన్ ఇమేజి'తీసుకు రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.అక్రమ ఆస్తులు కూడబెట్టిన వారి వివరాలు, జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
సీఎం పీఆర్వో విజయకుమార్ ఉద్వాసనతో మొదలైన ప్రక్షాళన త్వరలోనే ఊపందుకోబోతోందట. మరికొందరిని ఇంటికి పంపబోతున్నారట. ఇన్నాళ్లూ ట్రాన్స్కోలో జనరల్ మేనేజర్ గా ఉండి డిప్యుటేషన్ పై సీఎంఓలో పని చేసిన విజయ్ 24 కోట్ల నిధులను కైంకర్యం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన తన పరపతి, ముఖ్యమంత్రి దగ్గరున్న చనువును ఆసరా చేసుకొని కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర ఒక నిర్మాణ సంస్థతో మాట్లాడి ఒక అధునాతన అపార్ట్ మెంటులో తనవారికి 18 మందికి ఫ్లాట్లు ఇప్పించారట. ఈ వ్యవహారంలో మరికొందరు మంత్రుల పీఆర్వోలకూ సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.