కేసీఆర్‌కు ఫ్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేసిన బండి సంజయ్..?

Chakravarthi Kalyan
నాగార్జునసాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ జిల్లాపై వరాల వర్షం కురిపించారు. అంతే కాదు.. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనంటూ చెప్పేశారు. అయితే.. ఇది చాలా పాత డైలాగంటూ కౌంటర్ ఇచ్చిన భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌.. కేసీఆర్‌కు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఈ మాటను కేసీఆర్ ఎన్నో సార్లు తప్పారని బండి సంజయ్ గుర్తు చేశారు. నాగార్జునసాగర్ భూనిర్వాసితులైన గిరిజనుల భూముల్ని తెరాస నేతల కబ్జాలపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని సంజయ్ ప్రశ్నించారు.
గుర్రంబోడు తండాలో గిరిజన రైతుల భూముల్లో తెరాస ఎమ్మెల్యే బినామి అక్రమించుకుంటే అడగడానికిపోతే ప్రైవేటు గుండాలతో దాడిచేయించడమే కాకుండా 40 మందిని రెండు నెలల పాటు జైలులో ఎందుకు పెట్టారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ను తాను కుర్చివేసుకుని కూర్చొని పూర్తిచేయిస్తానని 6 ఏళ్ల కిందటే కేసీఆర్ చెప్పిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్ కుర్చీ దొరకలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
త్వరలో డిండి పూర్తవుతుందని చెబుతున్న కేసీఆర్, దానికి ఎగువన ఉన్న నక్కలగండి ఎప్పుడు పూర్తవుతుంది, శివన్నగూడెం ఎప్పుడు పూర్తవుతుందో ముందు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఈ ఆరేళ్లలో అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లివ్వని ఈ సర్కార్... ఉప ఎన్నికలు రాగానే తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరని  బండి సంజయ్ అన్నారు.
ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో 2004 నుంచే మంచినీళ్లు వస్తున్నాయని తెరాస సర్కార్ వచ్చి కొత్తగా చేసిందేమి లేదని బండి సంజయ్ అంటున్నారు. నాగార్జున సాగర్ లోని విజయపురిలోనే ఇప్పటికి ఇంటింటికి రోజూ నీళ్లు సరఫరా కాకపోవడం కంటే ఇంకైమైనా దౌర్భాగ్యం ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్న 3 లక్షలకు పైగా ఉన్న బత్తాయి రైతుల ప్రస్తావన కూడా చేయలేదన్నారు సంజయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: