ఉత్తరాఖండ్‌లో గతంలో జరిగిన ఘోరాలు తెలుసా? అక్కడే విలయాలు ఎందుకు..?

Chakravarthi Kalyan
ఉత్తరాఖండ్‌.. ఈ రాష్ట్రాన్ని దేవభూమి అంటారు. ఎందుకంటే.. ఇక్కడే హిమాలయాలు ఉంటాయి. వాటిలో కైలాసం కూడా ఉంటుందని హిందువుల నమ్మకం. అంతేనా.. భద్రీనాథ్ వంటి అనేక దేవాలయాలకు ఈ రాష్ట్రం నిలయం. అదే సమయంలో ఉత్తరాంఖండ్‌లో ప్రకృతి విపత్తులూ ఎక్కువే. తాజాగా మరోమారు ఈ రాష్ట్రంలో జలప్రళయం సంభవించింది. చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగి పడ్డాయి. ధౌలి గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగి.. ఏకంగా 150 మంది వరకూ కార్మికులను పొట్టన పెట్టుకుంది. రేనీ- తపోవన్‌ వద్ద ఉన్న పవర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిగా ధ్వంసమైంది.
ఉప్పొంగిన ధౌలి గంగా ధాటికి మరో మూడు వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. పవర్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండో-టిబెటిన్‌ బోర్డర్‌ పోలీసు అధికారులు చెబుతున్నారు. వీరంతా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ ప్రాంతంలో మంచుచరియలు విరిగి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ధౌలి గంగా ఉప్పొంగిన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిసర గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పౌరీ, తెహ్రీ, రుద్ర ప్రయాగ్‌, హరిద్వార్‌, దేహ్రాదూన్‌ జిల్లాలో హైఅలెర్ట్‌ ‌ప్రకటించింది.
అయితే.. ఉత్తరాఖండ్‌లో ఇలా జరగడం అసాధారణమేమీ కాదు.. గతంలోనూ అనేక భారీ ప్రమాదాలే జరిగాయి. గత ముప్పై ఏళ్లలో ఉత్తరాఖండ్‌ అనేక విలయాలు చూసింది. 1991 అక్టోబర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రతతో ఓ భూకంపం వచ్చింది. ఈ ప్రకృతి విపత్తులో 768 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టమై లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 1998లో పిథోర్‌గడ్‌ పరిధి మాల్పా గ్రామంపై కొండచరియలు విరిగి పడి ఆ ఊరు నామరూపాల్లేకుండా పోయింది. ఈ దారుణ ఘటనలో 255 మంది మృత్యువాత పడ్డారు.
ఆ తర్వాత.. 1999 లో చమోలీ జిల్లాపై మరోసారి భూకంపం విరుచుకుపడింది. అప్పడు కూడా వంద మందికిపైగా మరణించారు. వీటికంటే గొప్ప విలయం..  2013లో వచ్చింది. హిమాలయాల్లో సంభవించిన సునామీ ఉత్తరాఖండ్‌లో విధ్వంసం సృష్టించింది. 5 వేల 700 మందికిపైగా చనిపోయారు. ఇదీ ఉత్తరాఖండ్ విలయాల కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: