రామతీర్థం ఘటనపై జనసేన కమిటీ ఏర్పాటు

Siva Prasad
విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనను ఎవ్వరూ వదలట్లేదు. ఆధ్యాత్మిక వేత్తలు, రాజకీయ నాయకులు సైతం వారివారి శైలిలో పోరాడుతున్నారు. అసలు దోషులు ఎవరో తేలెవరకూ ఊరుకునేది లేదంటూ ఉద్యమిస్తున్నారు.ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు సైతం చెబుతున్నారు. తాజాగా రామతీర్థంలో చినజీయర్ స్వామి పర్యటిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ కూడా దూకుడు చూపేందుకు సిద్ధమవుతుంది. ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన వారిని గుర్తించి, చర్యలు తీసుకునే వరకు ఉద్యమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దోషులను శిక్షించే వరకూ పోరాటం చేయడానికి జనసేన ఓ కమిటీని నియమించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. 
                                                బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందంతో కలిసి పోరాటం చేయడానికి జనసేన కమిటీ పనిచేయనున్నట్లు సమాచారం. నలుగురు సభ్యులుండే ఈ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి పి.శివశంకర్‌ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్‌ బొడ్డేపల్లి రఘు వ్యవహరిస్తారు.
                                   రామతీర్థంలో ఘటనపై ఇంతవరకూ ఎటువంటి పురోగతి లేదని పవన్‌ మండిపడ్డారు. రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. తమకు స్వేచ్చను ఇస్తే ఎటువంటి కేసునైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్‌ది రికార్డుగా చెబుతుంటారని అన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్చను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి పవన్ భావిస్తున్నారు. తమ కమిటీ ద్వారా అసలు దోషులెవరో వెలికితీయాలని వపన్ కల్యాణ్ ధృడ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: