ఎన్నికల్లో ప్రచారం చేయనున్న వెంకటేష్.. ఏపీలో ఆ పార్టీ తరుపున ప్రచారం?

Suma Kallamadi
ఏపీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ వైపు వైసీపీ, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో విజయానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వైసీపీ సంక్షేమ పథకాలపై ఆధార పడింది. ఆ పార్టీ తరుపున కేవలం సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, కేడర్‌లో జోష్ నింపుతున్నారు. ఆ పార్టీకి ఏకైక స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. కొందరు సినీ నటులు ఆయనకు మద్దతుగా ఉన్నా, జగన్ ఒంటి చేత్తో ఎన్నికల ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నారు. మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పార్టీల అధ్యక్షులతో పాటు సినీ గ్లామర్ కూడా కలిసి రానుంది. టీడీపీకి బాలకృష్ణ, సినీ హీరో నిఖిల్, ఇంకొందరు నటులు ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేనకు స్వయంగా పవన్ ఉన్నారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీలోని హీరోలు ఆయన తరుపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ ఉన్నారు. మరో వైపు డ్యాన్స్ మాస్టర్ జానీ, సినీ నటుడు పృథ్వీ కూడా జనసేన తరుపున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో జనసేన తరుపున ప్రచారానికి రానున్నారు. ఇక సినీ రంగం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండే దగ్గుబాటి వెంకటేష్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు.
విక్టరీ వెంకటేష్ చాలా సౌమ్యుడు. తన పని తాను చూసుకునే వ్యక్తిత్వం ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం రాజకీయాల్లో ప్రచారానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డి తెలంగాణలోని ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరుపున అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్కడ ఆయన తరుపున వెంకటేష్ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలోని ఆయన ప్రచారం చేయనున్నారు. కైకలూరు బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. వెంకటేష్ భార్యకు ఆయన స్వయాన మేనమామ. దగ్గర బంధుత్వం ఉండడంతో ఆయన కామినేని తరుపున ప్రచారం చేసేందుకు రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ తరుపున, ఇక ఏపీలో బీజేపీ తరుపున విక్టరీ వెంకటేష్ ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. వెంకటేష్ ప్రచారం చేస్తే అది ఖచ్చితంగా ఆయా పార్టీల అభ్యర్థుల విజయాలపై ప్రభావం చూపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: