జగన్ వర్సెస్ నిమ్మగడ్డ.. ఇక తాడో పేడో తేల్చుకుంటారా..?
మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయించేశారు. జనవరి 23న తొలి దశ,27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 5,9,13,17న రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఏపీ సీఎస్తో భేటీ జరిగిన కొద్దిసేపటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మరి ఇప్పుడు ఏం జరుగుతుంది.. అసలు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగలుగుతుందా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా యంత్రాంగం అంటూ ఉండదు.. రాష్ట్ర యంత్రాగాన్ని వాడుకునే ఎన్నికలు నిర్వహించాలి. మరి రాష్ట్ర యంత్రాంగానికి అధిపతి అయిన సీఎస్ ఎన్నికలు నిర్వహించలేమని తెగేసి చెప్పేశారు.
అయినా సరే ఎన్నికల కోసం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసుకోవాలంటూ సీఎస్ చెబుతున్నా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. మరి నిమ్మగడ్డ ఎలా ఎన్నికలు నిర్వహిస్తారు.. ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠరేపుతున్న విషయం. మొత్తానికి ఇప్పుడు మరోసారి ఏపీ రాజకీయం వేడెక్కబోతోంది. ఇక నేరుగా సాగబోయే ఈ సమరంలో చివరకి ఎవరిది పై చేయి అవుతుందో చెప్పలేని పరిస్థితి..