ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వ్యాప్తి కలకలం !

NAGARJUNA NAKKA
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా వ్యాప్తి కలకలం రేపుతోంది. స్కూల్స్ ఓపెన్‌ అయిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్కూల్స్‌కు పిల్లలను పంపేందుకు తల్లితండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా స్కూల్స్‌లో హాజరు శాతం సగాన్ని మించడం లేదు. అయితే రాష్ట్రంలోని విద్యార్థుల్లో కరోనా వ్యాప్తి కేవలం ఒకశాతం లోపే ఉందన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా వ్యాప్తి జరగకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్ని కరోనా టెన్షన్ పెడుతోంది. స్కూళ్లు తెరిచిన వెంటనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 829 మంది టీచర్లు, 575 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.  దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. నెల్లూరు జిల్లాలో పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఉపాధ్యాయులు, పిల్లలకు జరిపిన కరోనా టెస్టులలో మొత్తం 65 కరోనా కేసులు బయటపడ్డాయి.

పశ్చిమ గోదావరి జిల్లా లో ఇప్పటివరకు 120 మంది టీచర్లు, 200 మందికి‌ పైగా విద్యార్దులకు పాజిటివ్‌గా తేలింది.  కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి హైస్కూల్‌‌లో పది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్‌ వచ్చింది.కృష్ణాజిల్లాలోనూ కేసులు వెలుగుచూస్తున్నాయి. నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో శానిటైజేషన్ చేయడం లేదంటూ పేరెంట్స్.. హెడ్‌మాస్టర్‌తో గొడవకు దిగారు.

విశాఖ జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 52 మంది వైరస్ బారిన పడ్డారు. నర్సీపట్నంలో పది మంది ఉపాధ్యాయులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం హైస్కూల్‌లో ఓ టీచర్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవ జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థులతో పాటూ ఓ టీచర్ వైరస్‌ బారినపడ్డారు. కర్నూలు జిల్లాలో ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోన వ్యాపించింది.కడప జిల్లాలో 31 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లకు కరోనా సోకింది.

విద్యాసంవత్సరం వృధా కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రోజురోజుకూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో నమోదవుతున్న కేసుల సంఖ్య 1 శాతం లోపే ఉన్నాయన్నారు. కరోనా వ్యాప్తి చెందుతుండడంతో తల్లితండ్రులు, విద్యార్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: