బీజేపీ చేసిన 'ఉచిత వ్యాక్సిన్ హామీ' తప్పేం కాదు - ఎన్నికల సంఘం!

SS Marvels
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ తరుణంలో ఇటీవలే ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచితంగా టీకా అందజేస్తామని బిహార్ ఎన్నికల మేనిఫేస్టోలో బీజేపీ ఇచ్చిన హామీపై దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని ధ్వజమెత్తాయి. అయితే ఈ హామీ ఎంత మాత్రమూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టం చేసింది.
బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందా? రాదా? అంటూ హక్కుల కార్యకర్త సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం కింద ఈసీని ప్రశ్నించారు. ఎన్నికల వేళ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, వివక్షతతో కూడిన వాగ్దానాలు చేస్తోందని సాకేత్ మండిపడ్డారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇది ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి రాదని పేర్కొంది. అంతేకాదు, మేనిఫెస్టోలలోని హామీలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండకూడదని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేదిగా ఉండరాదని, ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపకుండా ఉంటే సరిపోతుందని మూడు సూచనలు చేసింది.
‘రాజ్యాంగంలో పొందుపరచిన విధానాలు, నిర్దేశక సూత్రాలు పౌరులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించమని ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించాయి.. అందువల్ల ఎన్నికల మేనిఫేస్టోలో ఇటువంటి సంక్షేమం చర్యల వాగ్దానాలకు అభ్యంతరం ఉండదు’అని తెలిపింది. ఈసీ సమాధానంపై సాకేత్ గోఖలే విస్మయానికి గురయ్యారు. ‘కేంద్ర ప్రభుత్వం దీనిని ఒక నిర్దిష్ట రాష్ట్రం కోసం ప్రకటించిందని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఆశ్చర్యానికి గురిచేసింది’ అని అన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఉచిత టీకా హామీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బిహార్ ప్రజలకు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారా? మిగిలిన రాష్ట్రాలు పాకిస్థాన్‌లో ఉన్నాయా? అని శివసేన తీవ్రంగా మండిపడింది. మిగితా పార్టీలు కూడా బీజేపీపై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: