జగన్.. తెగేదాకా లాగుతారా...?

Satya
జగన్ అంటేనే మరో పేరు పట్టుదల అని అంటారు. ఆయన రాజకీయం అంతా అలాగే సాగింది, సాగుతోంది. జగన్ ఏం చేసినా కూడా దూకుడుగానే చేస్తారు. ఆ విషయంలో ఆయన ఎవరి సలహాలు తీసుకుంటారో కానీ ఒకసారి అడుగు ముందుకు వేస్తే మాత్రం వెనకకు తగ్గరు అన్న పేరుంది. ఇవన్నీ ఎందుకంటే ఇపుడు ఏపీలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి కారణంగానే జగన్ దూకుడు గురించి అంతా చర్చించుకుంటున్నారు. వైఎస్సార్ కి అతి సన్నిహితుడుగా పేరు పొందిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా జగన్ విషయంలో ఒక మాట అన్నారు. జగన్ చాలా దూకుడుగా సాగుతారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇపుడు జగన్ ఏకంగా న్యాయ వ్యవస్థనే ఢీ కొడుతున్నారు. ఈ విషయంలో తేడా వచ్చిదంటే జగన్ సీఎం పదవికే ముప్పు అని కూడా అంటున్నారు. టీడీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే ఈ ఏడాదిలో జరిగే క్రిస్మస్ వేడుకల నాటికి ఏపీలో చెదపురుగులు అన్నీ కొట్టుకుపోతాయని శాపనార్ధాలు పెడుతున్నారు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా వైసీపీ సర్కార్ కూలిపోతుందని చెప్పేస్తున్నారు అన్న మాట.
ఇక ఓ వైపు జగన్ రాసిన లేఖ జాతీయ స్థాయిలో చర్చలో ఉంది. ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. మరో వైపు చూసుకుంటే జగన్ ఈ విషయంలో ఎక్కడా తగ్గకూడద‌ని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. మరి ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్తారని కూడా వార్తలు వస్తున్నాయి. జగన్ ఒకసారి అనుకుంటే చాలు ఆ విషయంలో రాజీ పడరన్నది తెలిసిందే. తాడో పేడో తేలాలి.
కానీ ఇక్కడ ఆయన న్యాయ వ్యవస్థ తో ఘర్షణ పడుతున్నారు. ఫలితాలు  వేరేగా వస్తే జగన్ ని పదేళ్ళ తరువాత సీఎం గా చూసుకున్నామని సంబరపడుతున్న వారికి కూడా ఆందోళన మిగులుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఎవరి సలహావో ఏమో కానీ జగన్ ఇప్పటికే ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. దీని మీద ఇక వదిలేసి ముందుకువెళ్తేనే బాగుంటుందని వైసీపీలో ఆయన హితైషులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ వారి మాటను వింటారా. లేక తెగేదాకా లాగుతారా. చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: