మీడియా మంటలు: జగన్ అప్పట్లో ఆ జడ్జిని మేనేజ్ చేశారా..? సంచలనం బయటపెట్టిన ఏబీఎన్ ఆర్కే?
ఆయన తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఈ విషయం బయటపెట్టారు. జగన్ ఓ న్యాయమూర్తిని అప్పట్లో మేనేజ్ చేశారని నేరుగా చెప్పకుండా.. దాదాపు అదే అర్థం వచ్చేలా చాకచక్యంగా రాసుకొచ్చారు ఆర్కే. ఆయన ఏమని రాశారంటే.. “ ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ రాజా ఇళంగో అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయగా, జస్టిస్ రాజా ఇళంగో స్టే విధించారు. హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు' అని రాశారు ఆర్కే.
“ అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్ రాజా ఇళంగోనే! జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది క్రితం సదరు జస్టిస్ రాజా ఇళంగోను రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా నియమించారు. అప్పట్లో జగన్‌కు లభించిన ఉపశమనాలను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించలేదు. గతంలో మేలు చేసినందుకే జస్టిస్ రాజా ఇళంగోకు పదవి కట్టబెట్టారని ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు విమర్శించలేదు. సంస్కారం అంటే అది! న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారంటూ జగన్ అండ్ కో విచ్చలవిడిగా బరి తెగించి మరీ ఆరోపిస్తున్నప్పటికీ; జస్టిస్ రాజా ఇళంగోను అప్పట్లో మేనేజ్ చేశారనీ, ప్రతిఫలంగానే ఇప్పుడు పదవి ఇచ్చారనీ ఒక్కరైనా తప్పుబట్టకపోవడాన్ని ప్రజలు గమనించాలి “ ఇదీ ఆర్కే వాదన.
అంటే అప్పట్లో జగన్ కూడా ఆనాటి జస్టిస్ ఇళంగోవన్‌ను మేనేజ్ చేశారని చెప్పకనే చెబుతున్నారు ఆర్కే. మరి దీనిపై వైసీపీ ఏమైనా స్పందిస్తుందా చూడాలి..