కేసిఆర్ కు గవర్నర్ కు మధ్య విభేదాలు... అసలేం జరిగింది?

VAMSI
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి మరియు రాజ్ భవన్ కి మంచి సంబంధాలున్నాయని తెలిసినవే. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ ధోరణి పూర్తిగా మారిందా అనిపిస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి ఇలా  కొన్ని అంశాలలో రాజ్ భవన్ కు  మరియు ప్రగతి భవన్ కు మధ్య  విభేదాలు వస్తున్నట్లుగా తెలియ వస్తుంది. దీనికి సాక్ష్యంగా ఇటీవలే ఆయుష్మాన్ భారత్ మరియు ఆరోగ్యశ్రీ ల విషయంలో జరిగిన పరిణామాలే. ఇది ఎంతవరకు వెళ్తుందో అనేది రానున్న కాలంలో తెలుస్తుంది. ఆయుష్మాన్ భారత్ అమలు పరచాలని గవర్నర్ మరియు ఆరోగ్యశ్రీని ప్రధాన అంశంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి పట్టుబట్టడం ఈ వివాదానికి దారి తీసింది.

తెలంగాణ గవర్నర్‌గా డాక్టర్‌ తమిళిసై బాధ్యతలు చేపట్టి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో జరిగిన వ్యవహారాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రగతిభవన్‌తో రాజ్‌భవన్‌ను అనుసంధానం చేస్తానని చెప్పారు తమిళిసై. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణ సర్కార్‌ కూడా అమలు చేయాలని కోరారు. అయితే యాదృశ్చికంగా అదే సమయంలో ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇద్దరి కామెంట్స్‌ను పరిశీలించినవారు రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌ మధ్య దూరం ఉందని గుసగుసలాడుకుంటున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ బెటరన్న సీఎం కేసీఆర్‌! కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే.. తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తోన్న ఆరోగ్యశ్రీ పథకం ఎంతో భేష్‌ అని అసెంబ్లీలో ఆన్‌రికార్డ్‌ వెల్లడించారు సీఎం కేసీఆర్‌.  



కేంద్ర పథకాన్ని అమలు చేయాలని గవర్నర్‌ కోరినా. కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్‌ భారత్‌ నిధులు తీసుకుని  వివిధ ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నాయని.. తెలంగాణకు కూడా ఆ విధంగా నిధులు ఇస్తే.. ఆరోగ్యశ్రీకి వాడుకుంటామని స్పష్టం చేశారు సీఎం. తమిళిసై బాధ్యతలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో అనేక అంశాలలో ఇరువురికి అభిప్రాయభేదాలు వస్తున్నాయి. ఒకే అంశంపై ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో గవర్నర్‌ తమిళిసై అలా.. సీఎం కేసీఆర్‌ ఇలా  ప్రకటనలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.  కరోనా విషయంలో తెలంగాణ గవర్నమెంట్ సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని మరియు దీనిని తక్కువ అంచనా వేసిందని తద్వారా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అప్పట్లో పేర్కొనడం వివాదానికి దారి తీసింది.


రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ప్రకటన చేయడం లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరో సందర్భంలో భార్యల అధికారంతో భర్తలు జల్సా  చేయొద్దని..  ఫోరంఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ రాసిన లేఖకు స్పందనగా ప్రభుత్వానికి లేఖ రాశారు గవర్నర్‌. దీంతో ఆ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రజలను నేరుగా కలిసేందుకు రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని గవర్నర్‌ చేసిన ప్రకటన చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేందుకు ప్రజలకు సమయం ఇవ్వాలని సూచించారు. మరి ఈ విధంగా ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న రాజ్ భవన్ మరియు ప్రగతిభవన్లో సంబంధాలు రానున్న కాలంలో మెరుగు పడతాయా లేదా ఇంకా దూరం అవుతాయా అనేది వేచి చూడవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: