ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.... అంతర్రాష్ట్ర సర్వీసులు ఇప్పట్లో లేనట్లే..?

Reddy P Rajasekhar
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజూ అంచనాలకు మించి కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ 60,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతున్నాయి. కరోనా, లాక్ డౌన్ వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల అధికారులు అంతర్రాష్ట్ర సర్వీసుల గురించి చర్చించడానికి నిన్న భేటీ కావాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల చర్చలు వాయిదా పడ్డాయి.
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నడపడం కోసం ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య జూన్ నెలలోనే చర్చలు జరిగాయి. ఆ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు 256 బస్సులను నడుపుతామని ప్రతిపాదించింది. తెలంగాణ ఆర్టీసీ అందుకు ప్రాథమికంగా అంగీకరించింది. దీంతో హైదరాబాద్ లో మరోసారి సమావేశం జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావించారు.
 
కానీ ఊహించని విధంగా అదే సమయంలో హైదరాబాద్ లోని బస్ భవన్ లో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ సమావేశం వాయిదా పడింది. ఆ తర్వాత కూడా వివిధ కారణాల వల్ల ఈ సమావేశం తరచూ వాయిదా పడుతోంది. అయితే మరికొన్ని రోజుల్లో లాక్ డౌన్ 3.0 ముగియనున్న నేపథ్యంలో వచ్చే వారం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బస్సులు నడిపేందుకు ఒప్పందం కుదిరేంత వరకు అంతర్రాష్ట్ర సర్వీసులు లేనట్లేనని చెప్పవచ్చు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఏపీలో ప్రతిరోజూ 10,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతూ ఉండగా తెలంగాణలో 2,000 లోపే కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: