ఆంధ్రా అసెంబ్లీ సినిమా.. ఫైర్‌బ్రాండ్‌ రోజా లేక కళ తప్పుతుందా?

పదేళ్లు అసెంబ్లీలో తమ మార్క్‌ చూపిన రోజా..
విపక్షమైనా, అధికారంలో ఉన్నా రోజా రూటే సెపరేటు..
పవన్‌, లోకేశ్‌ అసెంబ్లీకి వస్తున్న వేళ రోజా మిస్‌?
జనం ఎదురు చూసిన ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేశాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోయినా కొన్ని స్థానాల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు అనే అంశాలపై చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. ఈసారి నగరి నుంచి హ్యాట్రిక్‌ కొట్టాలని భావించిన నటి రోజా ఆశలు గల్లంతేనని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు ముక్త కంఠంతో చెబుతున్నాయి. ఇదే నిజమైతే ఈసారి అసెంబ్లీలో రోజా కళ కనిపించకపోవచ్చు.

నటి రోజా.. గత పదేళ్లుగా ఏపీ అసెంబ్లీలో కనిపించారు. నటిగా జబర్దస్త్‌ వంటి ప్రోగ్రామ్‌ చేస్తూనే ఆమె అసెంబ్లీకి హాజరయ్యేవారు. రోజా అసెంబ్లీలో ఉంటే అదో కళ. చాలా మంది సభ్యుల్లా ఉన్నామంటే ఉన్నామనే రకం కాదు రోజా. అవకాశం వస్తే ప్రత్యర్థులను తన పదునైన వాగ్బాణాలతో చీల్చి చెండాడుతుంది. రోజా తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు వైసీపీ విపక్షంలో ఉంది. అయినా సరే.. తనదైన మార్క్‌ చూపించింది రోజా.

ఆనాటి అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో రోజా ప్రథమ వరుసలో ఉండేవారు. ఒక దశలో రోజాను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాలని.. ఆమె వస్తున్న దారిలోనే అడ్డుకుని అప్పటి అధికార పార్టీ నానా రచ్చ చేసింది. పలు సమయాల్లో రోజా చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. రోజా మాటలే కాదు.. రోజా చేష్టలు, సైగలు కూడా ఒకానొక దశలో కాంట్రావర్సీ అయ్యాయి.

ఏదేమైనా సరే.. రోజా అసెంబ్లీలో ఉందంటే.. తన మార్క్‌ చూపించేది. అధికారంలోకి వచ్చాక.. చివరి రెండున్నరేళ్లలో రోజా మంత్రి కూడా అయ్యారు. అయితే.. సరిగ్గా పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సమయంలో రోజా అసెంబ్లీ బయటకు వెళ్తున్నారు. ఈసారి రోజా కూడా నగరిలో గెలిచి అసెంబ్లీకి వస్తే సీన్‌ భలే రంజుగా ఉండేది. కానీ ఆ అవకాశాలు చాలా చాలా తక్కువ అని చెబుతున్నాయి ఎగ్జిట్‌పోల్స్‌. చూడాలి ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: