జస్టిస్ ఫర్ సుదీక్ష..! సోషల్ మీడియాలో కొత్త ఉద్యమం..!

NAGARJUNA NAKKA
జస్టిస్ ఫర్‌ సుదీక్ష..! సోషల్ మీడియాలో ఊపందుకుందీ ఉద్యమం. నిన్నా మొన్నటి వరకు ఎవరికీ తెలియని సుదీక్ష పేరు... ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆమె తన కుటుంబంలో మొదటి తరం ఉన్నత విద్యావంతురాలు. ఆరుగురు తోబుట్టువుల్లో మొదటి సంతానం. తల్లిదండ్రులకు చదువు లేకపోయినా.. తాను మాత్రం కష్టపడి చదివి.. బోర్డు ఎగ్జామ్స్‌లో 98 శాతం స్కోర్ చేసింది. అమెరికా కాలేజ్ లో చదవడానికి స్కాలర్ షిప్ కూడా సంపాదించింది. జీవితంలో బాగా స్థిరపడి.. తనకోసం కష్టపడ్డ తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలనుకుంది. కానీ ఆమె కలలు మధ్యలోనే చితికిపోయాయి. ఓ ఈవ్ టీజర్ చేసిన ఆకతాయి పని.. ఆమె ప్రాణాల్నే బలి తీసుకుంది. ఇంత జరిగినా పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదమని చెబుతుంటే.. కుటుంబ సభ్యులు మాత్రం హత్యే అంటున్నారు. యూపీ బులంద్ షహర్ జిల్లాలో జరిగిన దుర్ఘటన.. దేశం మొత్తాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది.

అమెరికాలో పై చదువులు చదువుతున్న సుదీక్ష , కరోనా విస్తరిస్తున్నందున జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగస్ట్‌లో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం నిన్న తన అంకుల్‌తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్‌ను వెంబండించాడు. వివిధ రకాల స్టంట్లు చేస్తూ .. సుదీక్ష ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆ బైకర్‌ కావాలనే తమ కూతురిని వెంబడించి , యాక్సిడెంట్‌ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం సుదీక్షను ఎవరూ వేధించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటున్నారు.

సుదీక్ష కుటుంబానికి న్యాయం చేయాలని సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. జస్టిస్ ఫర్ సుదీక్ష హ్యాష్ ట్యాగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అత్యుత్తమ ప్రతిభావంతురాల్ని.. ఓ ఆకతాయి బలి తీసుకున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి దగ్గర్నుంచి.. బాలీవుట్ నటి కంగనా రనౌత్ వరకు.. జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదీక్ష మృతి రోడ్ యాక్సిడెంట్ మాత్రమే అంటున్న యూపీ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవ్ టీజింగ్ సుదీక్షని బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: