తెలంగాణ విద్యార్థులకు శుభవార్త... డిజిటల్ క్లాసులు ఎప్పటినుంచంటే...?

Reddy P Rajasekhar
భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. వైరస్ విజృంభణ తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ క్లాసుల వైపు దృష్టి పెట్టాయి. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
 
ప్రతిరోజూ 50 శాతం మంది టీచర్లు ఈ నెల 17వ తేదీ నుంచి పాఠశాలలకు హాజరు కావాలని మంత్రి ఆదేశించారు. నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పరీక్షల నిర్వహణ, విద్యా సంవత్సరం, ప్రవేశ పరీక్షల గురించి చర్చ జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని మంత్రి అన్నారు.
 
వ్టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యాశాఖ 6 నుంచి 10 పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది. విద్యాశాఖ ఈ నెల 31వ తేదీన ఈసెట్, సెప్టెంబర్ 2వ తేదీన పాలిసెట్, సెప్టెంబర్ 9,10,11,14 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. మరోవైపు కరోనా విజృంభణ వల్ల డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో కొంత గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.
 
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ గురించి స్పష్టత వస్తుందని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ గురించి చర్చించామని తెలిపారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారమే పరీక్షల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని... సుప్రీం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: