పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు.. బాబు లెక్కల ప్రకారం అంత ఖర్చా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. అధికారులతో సమావేశం నిర్వహించి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను టార్గెట్ చేస్తూ బాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పోలవరం కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారని బాబు అన్నారు.
 
టీడీపీ హయాంలోనే 72 శాతం పోలవరం ప్రాజెక్ట్ పూర్తైందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ఏపీకి శాపంగా మారారని రివర్స్ టెండరింగ్ తో సిబ్బంది మార్చారని బాబు తెలిపారు. గత ప్రభుత్వం డయాఫ్రమ్ వాల్ ను కాపాడుకోలేదని పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని బాబు తెలిపారు. 446 కోట్ల రూపాయలతో మరమ్మత్తులు చేసినా బాగవుతుందనే పరిస్థితులు లేవని ఆయన చెప్పుకొచ్చారు.
 
సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగి ఉంటే నాలుగేళ్ల క్రితమే పోలవరం పూర్తయ్యేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అధికారులు పోలవరం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాల సమయం కావాలని అడుగుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ వల్ల వేల కోట్ల రూపాయల ప్రజధనం వృథా అయిందని బాబు తెలిపారు.
 
జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని చెప్పడానికి ఇది కేస్ స్టడీ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. పోలవరం ఆలస్యానికి ఏజెన్సీలను మార్చడమే కారణమని బాబు వెల్లడించారు. పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని కలలు కన్నానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లు, ఆరోపణల విషయంలో వైసీపీ లేదా జగన్ నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: