భర్తకు కరోనా.. భార్యకు శిక్ష : దేవుడా ఇదేం కరోనా కాలం..?

Chakravarthi Kalyan

కరోనా భయం జనంలో మానవత్వాన్ని చంపేస్తోంది. తమకు ఎక్కడ కరోనా వస్తుందో అన్న ఆందోళన మనుషుల్లో జాలి, దయను మింగేస్తోంది. కరోనా వచ్చిన రోగులను, వారి బంధువులను సామాజికంగా వెలివేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. అందులోనూ  కరోనా విజృంభిస్తున్న ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.  

 


రాజమండ్రి ఆల్కట్‌ గార్డెన్స్‌ ప్రాంతంలో ఓ మహిళ భర్తకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించాయి. అనుమానంతో పరీక్ష చేయించుకుంటే కరోనా అని తేలింది. స్వల్ప లక్షణాలే ఉండటంతో హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే అతనికి కరోనా పాజిటివ్ అని తెలుసుకున్ని ఇంటి యజమాని.. అతన్ని ఇంట్లో ఉండనివ్వలేదు. 

 


ఇంటి యజమానితో పాటు స్థానికులు కూడా అభ్యంతరం చెప్పడంతో భార్య ఆయన్ను బొమ్మూరులోని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తీసుకెళ్లింది. అనంతరం బుధవారం రాత్రి ఇంటికి వచ్చింది. అయితే ఆమెను  కూడా స్థానికులు అడ్డుకున్నారు. అద్దె ఇంట్లోకి రావొద్దంటూ యజమాని ఆంక్షలు పెట్టారు. ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్లగలనంటూ  ఆమె బతిమాలుకున్నా యజమాని పట్టించుకోలేదు.

 

ఆ భార్యభర్తలు అదే కాలనీలో సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కనీసం అక్కడైనా  ఆ రాత్రి తలదాచుకుందామని పాపం.. ఆమె అక్కడకు వెళ్లింది. అయితే అక్కడి వారు కూడా ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ రాత్రంతా రోడ్డుపైనే వర్షంలో తడుస్తూ కూర్చుంది. కరోనా ఇలా మనుషులను కర్కోటకులుగా  మార్చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: