గ్రేట్.. ఈ కొత్త వైసీపీ మంత్రి.. పదో తరగతిలో స్టేట్ ర్యాంకర్‌ తెలుసా...?

Chakravarthi Kalyan

రాజకీయ నాయకుల్లో పెద్దగా చదువుకున్న వారు కనిపించరు. విద్యాధికులు తక్కువ. ఏదో సర్టిఫికెట్ కోసం చదివామా అన్నట్టు ఉంటాయి చాలా మంది ట్రాక్ రికార్డులు. కానీ కొత్తగా జగన్ మంత్రి వర్గంలో చేరిన ఓ మంత్రి ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఆయనే సీదిరి అప్పలరాజు.. ఈయన వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో మత్స్యకార కుటుంబంలో జన్మించారు. 

 


సీదిరి అప్పలరాజు సొంతగ్రామంలో  ఎంపీయూపీ స్కూల్‌ లో 1నుంచి 7వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సింహాచలం అడివి వరం గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అప్పట్లో గురుకుల పాఠశాలలో సీటు సంపాదించడం అంటే మాటలు కాదు. ఆ తరవాత గురుకుల పాఠశాలలోనూ  సత్తా చాటారు. ఏకంగా పదో తరగతిలో  స్టేట్‌ నాలుగో ర్యాంకు సాధించారు. 

 

ఆ తర్వాత గాజువాక  మార్గదర్శి ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. మత్స్యకారుడిగా రిజర్వేషన్ ఉన్నా...  ఓపెన్‌ కేటగిరిలోనే  ఎంబీబీఎస్‌ సీటు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంట్రన్స్‌ పరీక్షలో పాసై కేజీహెచ్‌లో ఓపెన్‌ కేటగిరిలో పీజీ సీటు సాధించారు. ఎండీ జనరల్‌ మెడిసిన్‌ చేసి పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించారు. 

 

 

సీదిరి అప్పలరాజు నిత్యం ప్రజలలో ఉంటూ, పేదవారికి తక్కువ ధరకే వైద్య సేవలందించారు. క్రీడలకు కిట్‌లు పంపిణీ, బహుమతులు అందించడం వంటివి చేసేవారు. మొత్తానికి గతంలో పదో తరగతిలో స్టేట్ ర్యాంకు సంపాదించిన విద్యార్థి ఇప్పుడు స్టేట్ మంత్రి అయ్యారని పలాస వాసులు మురిసిపోతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యిన మొదటి వ్యక్తి కూడా అప్పలరాజే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: