పరువు పోగొట్టుకున్న ఖాకీలు.. !

NAGARJUNA NAKKA

అతి విశ్వాసం... కిడ్నాపర్లను తక్కువగా అంచనా వేసి పరువు పోగుట్టుకున్నారు యూపీ పోలీసులు. కిడ్నాపర్ల నుంచి బాధితుడ్ని విడిపించాల్సింది పోయి... వాళ్లు అడిగినంత డబ్బు ముట్టజెప్పి చివరికీ చేతులెత్తేశారు. డబ్బులు పోయాయి. పరువు పోయింది. చేసిన ఆపరేషన్ విఫలమై..తలపట్టుకుంటున్నారు. 

 

యూపీ పోలీసుల చేతగానితనం మరోసారి బయటపడింది. కిడ్నాపర్ల నుంచి బాధితుడ్ని విడిపిస్తామంటూ బీరాలు పలికిన కాన్పూర్‌ పోలీసులు... ఆ పని చేయలేకపోయారు. పైగా బాధిత కుటుంబానికి చెందిన 30 లక్షల్ని దుండగులకు  అప్పగించడం వివాదాస్పదమవుతోంది. దీంతో తమను పోలీసులు మోసం చేశారని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. 

 

కాన్పూర్‌కు చెందిన సంజిత్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. గతనెల 22 నుంచి బైక్‌తో సహా కనిపించకుండా పోయాడు. మూడు రోజుల తర్వాత పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా... కేసు నమోదు చేయలేదు. ఇటీవల సంజిత్‌ కుటుంబానికి అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. 30 లక్షల రూపాయలిస్తే సంజిత్‌ను విడిచిపెడతామన్నారు. ఓ ఫ్లై-ఓవర్‌పై డబ్బు ఇచ్చి సంజిత్‌ను తీసుకెళ్లాల్సిందిగా సూచించారు దుండగులు. బాధిత కుటుంబ పోలీసులకు ఈ విషయం చెప్పడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

అయితే..కిడ్నాపర్లను పట్టుకోడానికి ఎస్పీ అపర్ణా గుప్తా ఓ ప్లాన్‌ వేశారు. కిడ్నాపర్లు అడిగిన సొమ్మును సిద్ధం చేసుకోవాలని బాధిత కుటుంబానికి సూచించారు. 30 లక్షలు కిడ్నాపర్లకు ఇస్తే సంజిత్‌ను విడుదల చేస్తారని, అక్కడ కాపుగాసిన పోలీసు సిబ్బంది దుండగుల్ని పట్టుకుంటారని చెప్పారు. దీంతో ఇల్లును అమ్మి 20 లక్షలు, సంజిత్‌ చెల్లెలి పెళ్లి కోసం కొన్న నగల్ని అమ్మి మరో పది లక్షల రూపాయలు సమకూర్చింది బాధిత కుటుంబం. 

 

ప్లాన్ పర్‌ఫెక్ట్‌గా వేసినా... ఎగ్జిక్యూట్‌ చేయడంలో ఎక్కడో తేడా జరిగింది. ఎస్పీ అపర్ణా గుప్తాకు డబ్బులు అందజేస్తున్నప్పుడు బ్యాగ్‌లో ట్రాకింగ్‌ డివైజ్‌ పెట్టాల్సిందిగా కోరింది బాధిత కుటుంబం. అయితే, ఆమె దానిని లెక్కచేయలేదు.  ఫ్లై ఓవర్‌ వద్ద మఫ్టీలో కొంత మంది పోలీసుల్ని నియమించారు. అయితే, డబ్బు గల బ్యాగ్‌ను తీసుకున్న దుండగులు సంజిత్‌ను విడిచిపెట్టలేదు.

 

డబ్బుతో దుండగులు పారిపోతుంటే పోలీసులు పట్టుకోలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు తమను నిలువునా మోసం చేశారని ఆరోపిస్తోంది బాధిత కుటుంబం. ఈ వ్యవహారంలో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. త్వరలోనే కిడ్నాపర్ల నుంచి బాధితుడ్ని రక్షించడంతో పాటు 30 లక్షల రూపాయల్ని కూడా రాబడతామంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: