ఇటీవలి కాలంలో టీడీపీలో దళితనేత వర్ల రామయ్య చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రత్యేకించి సీఎం జగన్ పై విమర్శల కోసం వర్ల రామయ్యను చాలా బాగా వాడేసుకుంటోంది తెలుగుదేశం. తాజా కూడా వర్ల రామయ్య రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడిందని, దళితులకు అన్యాయం, అవమానాలు జరుగుతున్నాయని, దళితుల సాధికారత లేదని, మానవ హక్కులు ఉల్లంఘించబడినవని ఉత్తరాలు రాశారు.
ఇప్పడు ఈ లేఖలకు వైసీపీ కూడా కౌంటర్ ప్రారంభించింది. అయితే అది లేఖలతో కాకుండా మాటలతోనే మొదలుపెట్టింది. చంద్రబాబు మెప్పుపొందడం కోసం టీడీపీ నేత వర్ల రామయ్య మూడు రోజులుగా లేఖలు రాస్తున్నాడని, ఆ ఉత్తరాలను చిత్తుపేపర్లుగా పరిగణిస్తున్నానని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఇలాంటి చెత్త ఉత్తరాలు రాసిన వర్ల రామయ్యను ఏం పెట్టి కొడితే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదన్నారు సుధాకర్ బాబు.
పుట్టిన సామాజిక వర్గం కోసం ఒక్క రోజు గళం విప్పని వర్ల రామయ్య.. నక్కజిత్తుల నారా చంద్రబాబు విష కౌలిగిలో చిక్కుకొని పదే పదే సీఎంపై మాటల దాడి, రాతల దాడి చేస్తున్నాడని సుధాకర్ బాబు మండిపడ్డారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దళితులకు ఏం చేశారో.. సీఎం వైయస్ జగన్ ఏడాది పాలనలో దళితులకు ఎంత మేలు చేశారో.. ఎన్ని పదవులు ఇచ్చారో.. చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని సుధాకర్ బాబు సవాల్ విసిరారు.
ఈ విషయంలో చర్చకు వచ్చే దమ్ము వర్ల రామయ్యకు ఉందా అని ప్రశ్నించారు. కావాలంటే.. మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి అయినా వచ్చి చర్చించేందుకు సిద్ధమని సుధాకర్ బాబు సవాల్ విసిరారు. పోస్టర్ల ఖర్చు కూడా భరించలేని దళితులను ఎంపీలు, ఎమ్మెల్యేలను చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిదని, దళిత నేతను ఉప ముఖ్యమంత్రిని చేశారని, దళిత మహిళను హోంమంత్రిని చేశారని సుధాకర్ బాబు గుర్తు చేశారు. దీనిపై మరి వర్ల రామయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: