బాబు టెక్నాలజీని వాడని జగన్... కారణం ఇదేనా?

M N Amaleswara rao

ఆర్టీజీఎస్‌... రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌.. ఈ పేరు గత ఐదేళ్లు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలనలో ఎక్కువ వినిపించింది. ప్రతి దానిలోనూ టెక్నాలజీని ఉపయోగించుకునే చంద్రబాబు, రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగిన తనకు తెలియాలనే ఉద్దేశంతో  రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌ ని తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మస్థాయిలో జరుగుతున్న అంశాలన్నింటినీ సచివాలయంలోని కూర్చుని ఆర్టీజీఎస్‌ నుంచే పర్యవేక్షించే వారు. తిత్లీ తుఫాన్ సమయంలో కూడా దీన్నే ఎక్కువగా ఉపయోగించుకున్నారు.

 

అయితే చంద్రబాబు హయాంలో ఎక్కువగా వినిపించిన ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థ పేరు...జగన్ అధికారంలోకి రాగానే అడ్రెస్ లేకుండా పోయింది. అసలు జగన్ ఈ వ్యవస్థని పెద్దగా ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. ఏదో మొదట్లో వరదల సమయంలో దీనిని ఉపయోగించుకున్నట్లున్నారు. ఇక తర్వాత దీని పేరు పెద్దగా వినపడలేదు. ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ ఆర్టీజీఎస్ ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి.

 

జగన్ ఈ సమయంలో ఆర్టీజీఎస్ వ్యవస్థని ఉపయోగించుకోపోవడానికి కారణం లేకపోలేదు. ఆర్టీజీఎస్ అనేది టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. ఒకోసారి ఇది వాస్తవమైన ఫలితాలు అందించడంలో విఫలం కావొచ్చు. పైగా పల్లెటూర్లలో పని ఎలా జరుగుతుందో, ఈ వ్యవస్థ పెద్దగా చెప్పలేదు. అయితే  ఆర్టీజీఎస్ కంటే పవర్ ఫుల్ వాలంటీర్ల వ్యవస్థ జగన్ దగ్గర ఉంది.

 

ఇప్పుడు ఆ వ్యవస్థ ద్వారానే జగన్ కరోనా వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నారు. ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్లి, సర్వేచేసి వివరాలు సేకరించగలుగుతున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోగలుగుతున్నారు. మిగతా రాష్ట్రాలలో ఇలాంటి వ్యవస్థ లేకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ముందున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టే, జగన్ కు ఆర్టీజీఎస్ తో పెద్దగా అవసరం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: