బడ్జెట్ 2020 : దగాపడ్డ తెలుగోడు... ఒక్కటీ లేదే...!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అన్యాయమే జరిగింది. కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఒక్క ఎక్స్ ప్రెస్ హైవే కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కేంద్రం బడ్జెట్ లో 2,000 కిలోమీటర్ల చెన్నై - బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణమే లక్ష్యం అని ప్రకటన చేసింది.
18,600 కోట్ల రూపాయలతో బెంగళూరు నగరానికి మెట్రో తరహా సబర్బన్ రైల్వే వ్యవస్థ కేంద్రం ఏర్పాటు చేయనుంది. 20 శాతం కేంద్ర నిధుల ద్వారా 60 శాతం అదనపు నిధుల సమీకరణ ద్వారా ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. రైలు మార్గాలకు రెండు వైపులా సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటన చేశారు. ముంబాయి - అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటన చేశారు.
పర్యాటక కేంద్రాలకు తేజస్ రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. 11 వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ చేపడుతున్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అనుకూలంగా రైళ్ల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కనీసం ఒక్క ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కూడా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు బడ్జెట్ విషయంలో దగా పడ్డారనే చెప్పాలి.
కేంద్రం మరోసారి తెలుగురాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఈ బడ్జెట్ ద్వారా నిరూపితమవుతోంది. కనీసం రెండురాష్ట్రాలలో ఒక రాష్ట్రానికైనా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ బడ్జెట్ లో రైళ్ల విషయంలోనే కాదు ఇతర విషయాల్లో కూడా తెలుగు రాష్ట్రాలకు నిరాశ తప్పటం లేదు. కేంద్రం బడ్జెట్లో బీజేపీకి ప్రాధ్యాన్యత ఉన్న రాష్ట్రాల పట్లే ఎక్కువగా మమకారం చూపుతోందని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.