ఏపీ ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్... అమలులోకి కొత్త నిబంధనలు...?
ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. గతంలో నామమాత్రంగా జరిగిన మానవ విలువలు, నైతికత, పర్యావరణ విద్య సబ్జెక్టులలో నిబంధనలను బోర్డు కఠినతరం చేసింది. ఇకనుండి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టులలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. ఈ పరీక్షలలో పాస్ కాకపోతే ఇంటర్ సెకండియర్ పూర్తయిన తరువాత ఇచ్చే ధ్రువీకరణ పతాన్ని బోర్డు జారీ చేయదు.
ఇంటర్మీడియెట్ బోర్డు గతంలోనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి నెల 28, 30 తేదీలలో ఈ రెండు పరీక్షలను నిర్వహించటం కొరకు షెడ్యూల్ ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం 28వ తేదీన నైతికత, మానవ విలువలు పరీక్షను ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. పర్యావరణ విద్య సబ్జెక్టును 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.
100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థులు కనీసం 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరీక్షలకు హాజరు కాకపోయినా, హాజరైనప్పటికీ పాస్ కాకపోయినా ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ తో వారు ఈ పరీక్షను రాయవచ్చు. ఇంటర్మీడియెట్ బోర్డు ఆన్ లైన్ ప్రశ్నాపత్రాల ద్వారా నైతికత, మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్షలను, ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనుంది.
ఇంటర్మీడియెట్ బోర్డు ముద్రించిన ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపే విధానానికి స్వస్తి పలికి పరీక్ష సమయానికి ముందు ఆన్ లైన్ లో ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనుంది. ఇంటర్మీడియెట్ సెకండియర్ జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షలు జరగనున్నాయి. జంబ్లింగ్ పద్దతిలో ఈ ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.