మీడియా మంటలు : మహిళా రిపోర్టర్లపై అమరావతి రైతుల దాడి కరెక్టేనా..?

Chakravarthi Kalyan
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న రైతులు.. దాని కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్లను అందులోనూ మహిళా రిపోర్టర్లపై దాడి చేయడం కలకలం రేపింది. మీడియా సర్కిళ్లో ఈ అంశం సంచలనం కలిగించింది. ఇలా దాడిగి గురైన వారిలో టీవీ, మహాటీవీ రిపోర్టర్లు ఉన్నారు. ఈ ఘటన మరోసారి తెలుగు రాష్ట్రాల్లో మీడియా తీరు తెన్నులపై చర్చకు దారి తీసింది.

ఈ విషయాన్ని చర్చించాలంటే.. అసలు దాడికి దారి తీసిన పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలి. అమరావతి రైతుల దీక్షలను తెలుగు దేశం అనుకూల మీడియా బాగా కవర్ చేస్తోంది. ఇదే సమయంలో కొన్ని ఛానళ్లు రైతుల దీక్షలను లైట్ గా తీసుకుంటున్నాయి. అంతే కాకుండా.. రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అని సదరు రిపోర్టర్లు మాట్లాడినట్టు రైతులు చెబుతున్నారు. కడుపు మండి తాము ఆందోళన చేస్తోంటే.. మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్తులు అంటారా అన్నది వారి ఆగ్రహానికి కారణమైన అంశం.

అయితే మీడియా ప్రతినిధుల వాదన మరోలా ఉంది. తాము రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని వారు చెబుతున్నారు. కానీ.. సోషల్ మీడియాలో పాత క్లిప్పింగులకు అదనంగా కొన్ని జోడించి.. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక, టెక్నాలజీ పెరిగిపోయాక.. ఎలాంటి వీడియో అయినా తయారు చేయడం సులభం అయ్యింది. ఒకసారి అది సర్క్యులేట్ అయ్యిందంటే.. దాన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు.

కొందరు కావాలనే ఇలాంటి వీడియోలు సృష్టిస్తున్నారు. ఏదేమైనా ఒకవేళ సదరు రిపోర్టర్లు అలా నిజంగానే అన్నా దాడి చేయాల్సిన అవసరం లేదు. వారు పని చేసే యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లడమో.. లేదా.. ఆయా చానళ్లపై చట్టప్రకారం పరువు నష్టం దావా వంటి కేసులు పెట్టడమో చేయాలి. లేకపోతే.. ఆయా ఛానళ్లను తమ కార్యక్రమాలకు రాకుండా బహిష్కరించాలి. అలా కాకుండా నేరుగా భౌతికంగా దాడికి ప్రయత్నించడాన్ని ఏమాత్రం సమర్థించలేం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: