కూలుతోన్న మ‌రో కాషాయ కోట‌... జార్ఖండ్‌లోనూ క‌మ‌ల విలాప‌మేనా...?

Reddy P Rajasekhar

జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 5 విడతల్లో నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని పార్టీలు జార్ఖండ్ లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒంటరిగా 79 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ పార్టీలు ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ 31స్థానాల్లో, జార్ఖండ్ ముక్తి మోర్చా 43 స్థానాల్లో, ఆర్జేడీ 7 స్థానాల్లో పోటీ చేశాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఏ పార్టీకైనా 41 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. జార్ఖండ్ లో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ సాగుతోంది. 
 
81 స్థానాలలో కాంగ్రెస్ జేఎమ్ఎమ్ కూటమి 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ పార్టీ కేవలం 32 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఏజెఎస్‌యూ 6 స్థానాల్లో, జేవిఎమ్ పార్టీ 3 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఎన్నికల ఫలితాల తీరు చూస్తుంటే బీజేపీ పార్టీకి మరోసారి నిరాశ తప్పదని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
బీజేపీ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని తెలుస్తోంది. కాంగ్రెస్ జేఎమ్ఎమ్ కూటమి స్వల్ప మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చే అవాకాశాలు ఉన్నాయి. హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2020 జనవరి 5వ తేదీతో ముగియనుంది. బీహార్ నుండి 2000 సంవత్సరంలో విడిపోయి ప్రత్యేక రాష్టంగా అవతరించిన జార్ఖండ్ లో జరుగుతున్న నాలుగో అసెంబ్లీ ఎన్నికలివి. ఇప్పటికే మహారాష్ట్ర రాష్టంలో కొన్ని కారణాల వలన అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ పార్టీకి జార్ఖండ్ ఫలితాలు కూడా నిరాశనే మిగిల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: