గుడ్ న్యూస్.. విజయవాడ రూపు మారబోతోందా.. ?
విజయవాడ.. ఏపీలోనే ప్రముఖ రాజకీయ, వ్యాపార ప్రాంతమైనా ఇంకా రాజధాని స్థాయిలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. తాజాగా వైసీపీ సర్కారు విజయవాడ అభివృద్ధిపై దృష్టి సారించింది. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించించారని, ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి బొత్స సత్యనారాయణ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు.
డంపింగ్ యార్డ్ తరలింపుపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌కు ఆయన కీలక సూచనలు చేశారు. సింగ్ నగర్‌లో డంపింగ్ యార్డును తరలించి అదే ప్రాంతంలో పార్క్‌ను ఏర్పాటు బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. వాంబే కాలనీ డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని సింగ్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ను గుంటూరుకు తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాంబే కాలనీ, సింగ్ నగర ప్రాంతవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపైనా బొత్స మండిపడ్డారు. నాలుగు జిల్లాల్లో ఉన్న 14368 హౌసింగ్ యూనిట్లకు టెండర్‌కు వెళ్తే దాని అగ్రిమెంట్ కాస్టు రూ.707.4 కోట్లు ఉందని రివర్స్‌టెండరింగ్ విధానంలో రూ.601.12 కోట్లకు కోడ్ చేయడం జరిగిందన్నారు.
చిత్తూరులో ఉన్న ప్యాకేజీకి రూ.40.85 కోట్లు తక్కువకు వేశారు. అలాగే కృష్ణా జిల్లాలో 14.35, విశాఖపట్నంలో రూ.28.83, విజయనగరంలో రూ.21.88 కోట్లు తక్కువకు కోడ్ చేసి కంపెనీలు పనులు దక్కించుకున్నాయని, రివర్స్‌టెండరింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ. 105.91 కోట్లు ఆదా అయ్యిందన్నారు. అదే గత ప్రభుత్వంలో అయితే రూ.106 కోట్లు పెరగడమే కాకుండా లబ్ధిదారుడికి రూ. 70 నుంచి రూ. 90 వేల భారం పడేదని మంత్రి బొత్స సత్యనారాయణా అన్నారు.