స్పెషల్: నరేంద్ర మోడీ సమర్ధతకు సవాల్ విసిరే "యూనిఫాం సివిల్ కోడ్"

మార్కండేయ కట్జూ ఒక ప్రసిద్ధ జూరిస్ట్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పనిచేసిన అపార అనుభవం, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా  పని చేసి సాధించిన సామాజిక జీవన విధానం పై అధారిటీ. అటు న్యాయ శాస్త్రం ఇటు సామాజిక జీవన విధానం సంపూర్ణంగా ఆర్ధం చేసుకున్న ఈయనే 'ఉమ్మడి పౌరస్మృతి ఉండి తీరాలి' అంటూ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు.


ఢిల్లీ జామా మసీదు షాహి ఇమామ్ కంటే రెండాకులు ఎక్కువే చదివిన మార్కండేయ కట్జూ 31 మే, 2014 నాడు ఢిల్లీలో ఒక ప్రకటన చేస్తూ 'యూనిఫాం సివిల్ కోడ్' ఉండి తీరాలి అన్నారు. ఇంత కాలంగా మహమ్మదీయ నాయకులు వ్యతిరేకిస్తూ వస్తున్న ఉమ్మడి పౌరస్మృతి కావాలని మార్కండేయ కట్జూ అనడం సమాజంలో వచ్చిన మార్పు కు సంకేతం.


ఉమ్మడి పౌరస్మృతి కావాలని ఇంతకాలంగా భాజపా కోరుతూ వస్తున్నది. ఇది ఇలా ఉండగా ఇంద్రేష్ కుమార్, ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నాయకుని నేతృత్వంలో ‘రాష్ట్రీయ ముస్లిం మంచ్’ అనే సంస్థ ఆధ్వర్యంలో ఒక లక్ష మంది ముస్లింలు వ్రాత పూర్వకంగా 'యూనిఫాం సివిల్ కోడ్' కావాలని కోరారు. వారు గోహత్యని కూడా నిషేధించాలని కోరారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే రాష్ట్రీయ ముస్లిం మంచ్ వేదిక ఆధారంగా కాశ్మీరు ముస్లింలు ఇలా ప్రకటించారు - "ఆజాద్ కాశ్మీరు గురించి కొందరు మాట్లాడుతారు, మేము ఇప్పటికీ 'ఆజాద్'గా ఉన్నాం కదా! ఇంకా ఏ ఆజాద్ గురించి మాట్లాడుతున్నారు?" (హూ వాంట్ ఆజాద్? వెన్ వి హావ్ ఆజాద్ ఆల్రడీ?" అన్నారు. ఈ ప్రకటన వారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేశారు.


ప్రజల ఆలోచనా విధానాల్లో క్రమంగా వస్తున్న మార్పుని గమనిస్తూ వస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అందుకే ‘తమ సైద్ధాంతికతను రాజ్యాంగ స్పూర్తిలోకి తర్జుమా చేస్తూ రావటం’ కనిపిస్తూనే ఉంది. సరిగా పరిశీలించండి హిందూ మతవాది, ఆర్ఎస్ఎస్ జనిత భావజాలంలోంచి ఏదిగిన ‘నమో’ - విశాల లౌకికవాద దృక్పథం పుణికి పుచ్చుకున్న మార్కండేయ కట్టూ ఆలోచనలతో సింక్రనైజ్ అవ్వటమే - దేశ ఐఖ్యతా సిద్ధాంతానికి పునాదులు పడుతున్నట్లే. 


భారతదేశంలో నివసించే ప్రజలకు మతపరమైన ప్రత్యేక హక్కులు లేకుండా, ఉమ్మడి పౌర స్మృతి తేవాలనేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలలోని ముఖ్య సిద్దాంతం.


ఆ పార్టీ కోరుకునే మూడు కీలకాంశాలు: 

*జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు,

*రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం

*ఉమ్మడి పౌరస్మృతి

 

పార్లమెంటులో మెజారిటీ సాధించటం ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ప్రజల ఆలోచనా విధానాలను మార్పులను గమనిస్తూ చారిత్రక ఆధారాలతో, ఆర్కియాలజీ త్రవ్వకాలలో లభించిన ఋజువులతో,  న్యాయస్థానం తన తీర్పు ద్వారా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.


ఇక మిగిలింది ‘ఉమ్మడి పౌరస్మృతి’ మాత్రమే. "రాజ్యాంగం నిర్వచించిన సూత్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి" అమలు లోకి తీసుకు రావటానికి ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు లేవు. అయితే దీని అమలుకు మతమే ఇక్కడ ప్రధాన అవరోధం.


బహుముఖ మత విశ్వాసాలకు ఆలవాలమైన భారత్ లో పలు విభిన్న ఆచార వ్యవహారాలు సంస్కృతులు, సాంప్రదాయాలు సహస్రాబ్ధాలుగా విలసిల్లుతున్నాయి. అయితే అన్నీ మతాల్లో స్త్రీ పురుష సమానత్వం అనేది మృగ్యమై మత పరమైన వివక్ష నెలకొని ఉంటూ వస్తుంది. దాన్ని తొలగించాలనే విషయంలో న్యాయస్థానం నుంచి పూర్తి న్యాయ చట్టపరమైన అనుమతి  లభిస్తే 'ఉమ్మడి పౌరస్మృతి' విషయం లోనూ ముందడుగు వేయవచ్చనేది కమలనాథుల ఆలోచన ఆశయం ఆకాంక్ష కూడా!


ఇందుకు తొలి అడుగుగా ముస్లిం సమాజంలోని అవాంచిత అసహజ న్యాయమైన తలాక్ తలాక్ తలాక్ అంటే త్రిపుల్ తలాక్ అనే సాంప్రదాయానికి నిజేపి చెక్ పెట్టింది. ఇక హైందవ సమాజంలోని “శబరిమల దేవస్థానంలో మహిళల ప్రవేశానికి ఉన్న సైద్ధాంతిక సాంస్కృతిక అవరోధం” తొలగించటం ద్వారా దేశంలో స్త్రీ పురుష సమానత్వా నికి అంటే ఏకత్వాన్ని సాధించి అమలు చేసి తద్వారా 'ఉమ్మడి పౌరస్మృతి'  తీసుకు రావాలనే ఆశయం కేంద్రానికీ ఉంది.


“భిన్నత్వంలో ఏకత్వం” భారతీయ మౌలిక సిద్ధాం జీవన విధానం. అనేక రకాల భిన్నమైన మతాలు, ఉపమతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇక్కడ వేలాది  సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. భిన్న మతాలను అనుసరించి విభిన్న సాంఘిక జీవన శైలి  అనుసరిస్తున్నారు ప్రజలు. ఈ మతాల కారణంగా ఐఖ్యత సాధించాలంటే కొన్ని హక్కులను కొన్ని మతాలవారు కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా లింగభేధం వలన మహిళలే ఇందుకు బాధితులుగా మిగిలిపోతున్నారు.


రాజ్యాంగం వివరించిన నిర్వచించిన సహజ న్యాయ సూత్రాలు, పౌర హక్కులు, సమానత్వం, - మత సంప్రదాయాలు, ఆచారాల వ్యవహారాల మధ్య సున్నితమైన విభజన రేఖ ఉంటుంది. ఒకదానికొకటి పరస్పరం నిత్యం సంఘర్షించుకుంటున్న సమాజం మనది. కానీ అంతిమంగా అధికసంఖ్యాక ప్రజల మనోభావాలే అమలై పోతుంటాయి.


శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం కూడా ఆ వరసలోదే. ప్రజల మత విశ్వాసాలతో ముడిపడిన హక్కులు పరిరక్షించాలనే ఉద్దేశం రాజ్యాంగంలో సైతం కనిపిస్తుంది. సంఘర్షణ నివారణ అవసరం కదా! అయ్యప్ప దేవస్థానం లోకి ఆలయ నియమ నిబంధనలను అనుసరించి Rతుక్రమంలో అనగా 10 నుంచి 50 సంవత్సరాల వయసు loa ఉన్నస్త్రీల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. అయితే 2018 సెప్టెంబర్ 28 న సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతించాలని ఒక మహిళా సభ్యురాలుతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని మళ్ళీ ఒకసారి పున:  సమీక్షించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా అనేక రివ్యూ పిటిషన్లు దాఖలు అయిన నేపథ్యంలో, భారత అత్యున్నత న్యాయస్థానం వీటిపై విచారణ జరిపి ఫిబ్రవరి 6వ తేదీన తన తీర్పును రిజర్వులో ఉంచింది.


రాజ్యాంగంలోని 25వ అధికరణం పౌరులు తమకు నచ్చిన మతాన్ని అవలంబించుకునే హక్కును కల్పిస్తుంది. అదే విధంగా 26వ అధికరణం ఏ మతానికైనా తమ మత వ్యవహారాలను అనుసరించే స్వేచ్ఛను కల్పిస్తోంది. ఈ విభిన్న సంప్రదాయాలు, ఆచారాలను రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలో భాగంగా పరిగణించాలా? లేకపోతే సహజ న్యాయ సూత్రాల్లో భాగంగా రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుష భేధం నివారించి దేవాలయాల్లో లింగ వివక్షకు స్వస్తి పలకాలా? అన్నదే అసలు ధర్మ సూక్ష్మం – ఈ ధర్మ మీమాంస తేలాల్సి ఉంది. దానిని  తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు “ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం”భుజస్కంధాలపై పడుతోంది.


మతం అత్యంత సున్నితమైన అంశం. రాజ్యాంగ రచయితలు సైతం మత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించి, సూత్రాలను నిర్ధారించారు. అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక అవగాహనకు రాలేక పోయింది. అందుకే విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. దీనికి కారణం విషయ తీవ్రతే.


అధికసంఖ్యాక మతస్తుల మనోభావాలు, పౌరులందరికీ లింగ వివక్షకు అవకాశం లేకుండా రాజ్యాంగ హక్కుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు న్యాయస్థానమే మార్గనిర్దేశం చేయాల్సిన అగత్యాన్ని రాజ్యాంగమే దానికి కల్పించింది. 


రాజ్యాంగ సూత్రాలకు అన్వయంతో పాటు భాష్యం చెప్పే బాధ్యత, అధికరణాలని నిర్వచించే స్వేచ్ఛ ఉన్నత న్యాయస్థానాలకు ఉంటుంది. అందువల్లనే రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టు కుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమోఘమైన అనుభవమున్న న్యాయ నిపుణులు సుదీర్ఘ సూక్ష్మ పరిశీలన ద్వారా చర్చలతో తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతోనే అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశ విషయంపై సమీక్షను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.


ఇక్కడ మత, రాజ్యాంగ లక్ష్యాలతో ముడిపడిన విషయాన్ని న్యాయస్థానం తన విచక్షణ, వివేచన ద్వారా విషయాన్ని తరచి చూసి తీర్పు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందనే విషయం ప్రధానం అవుతుంది. దాన్ని కొంతకాలం పక్కన పెడితే, ఇది దేశ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితంచేసి, కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: