ఆ జగన్ కోరిక తీరిస్తే.. ఆ జిల్లాలకు భలే లాభం..?

Chakravarthi Kalyan

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసారు. రాష్ట్రానికి సంబంధంచిన పలు అంశాలు చర్చించారు. రాష్ట్రాన్ని సాధ్యమైనంతగా ఆదుకోవాలన్నారు. ఇదే సమయంలో జగన్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేస్తుంది. జనాభా ప్రాతిపదికన ఈ సాయం ఉంటోంది. అయితే ఈ సాయంలోనూ వివక్ష ఉండటాన్ని జగన్ గుర్తించారు.


ఆ విషయంపై అమిత్ షా తో చర్చించారు . వెనుకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల కైటీరియాను మార్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరారు. ఏపీలో వెనుకబడ్డ జిల్లాల్లో తలసరి రూ.400 ఇస్తే బుందేల్‌ఖండ్, కలహండిలో తలసరి రూ.4 వేలు ఇస్తున్నారన్నారు. ఇదే తరహాలో ఏపీలోని వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రరాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు రూ.2,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని.. మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని అమిత్‌ షాను కోరారు.


రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలను అధిగమించగలమని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం. విభజన చట్టంలోని హామీలు, వెనుకబడ్డ జిల్లాలకు నిధుల విడుదలపై అమిత్‌షాతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చర్చించారు.


పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదాతోనే ఈ సమస్యలను అధిగమించగలమని, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కాకుండా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా ఉండాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: