తెలంగాణ గవర్నర్ ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్లినట్టు?

NAGARJUNA NAKKA
తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు కారణం ఏంటి? ప్రధాని నరేంద్ర మోడీతో మ‌ర్యాద‌పూర్వక సమావేశమేనా? రాష్ట్రంలో ఆర్టీసీ స‌మ్మెపై ఇంటెలిజెన్స్‌తో పీఎంఓ నిజంగానే స‌మాచారం సేకరించిందా? తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిస్థితిపై హోంమంత్రి అమిత్ షాకు గవర్నర్ నివేదించారా? అసలు...తెలంగాణలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సమయంలో గవర్నర్ తమిళిసై ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు వెళ్లినట్లు?
 
తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌ ప‌ద‌వీ బాధ్యత‌లు చేపట్టాక ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గ‌వ‌ర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన త‌ర్వాత ఇప్పటికే ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పటికీ ప్రధాని, హోంమంత్రిని కలిసే అవకాశం కుదరలేదు. ఐతే... తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావ‌డం చ‌ర్చనీయాంశమైంది. 


రెండురోజుల కిందటే ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరుకున్న గ‌వ‌ర్నర్ ముందుగా ఖ‌రారు అయిన అపాయింట్ మెంట్ స‌మ‌యానికి సిద్ధంగా ఉన్నారు. ఐతే, ప్రధాని మోడీ హ‌ర్యానా ఎన్నిక‌ల ప్రచారం నుంచి ఆల‌స్యంగా ఢిల్లీకి చేర‌ుకున్నారు. దీంతో ముందుగా ఖ‌రారు చేసిన అపాయింట్‌మెంట్ ర‌ద్దు అయింది. ఆ తర్వాత నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాల‌యంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె, ప్రభుత్వ మొండి వైఖ‌రి త‌దిత‌ర అంశాలు ప్రధాని, హోంమంత్రి ముందుంచినట్లు సమాచారం. కొద్ది రోజులుగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఒక నివేదిక సైతం కేంద్రానికి స‌మ‌ర్పించిన‌ట్టు తెలుస్తోంది. 


ఇక...ఆర్టీసీ స‌మ్మెపై ఇంట‌ెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని గ‌వ‌ర్నర్ కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కార్మిక సంఘాల గొంతెమ్మ కోర్కెలను ఆమోదించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీయలేమనే సీఎం ఆలోచనను ప్రధానికి నివేదించారని తెలుస్తోంది. స‌మ‌స్యను ప‌రిష్కరించ‌కుండా రాజ‌కీయం చేయాల‌ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయ‌త్నిస్తున్నట్టు గ‌వ‌ర్నర్ త‌న వ్యక్తిగత అభిప్రాయాన్ని హోం మంత్రికి తెలిపిన‌ట్టు స‌మాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే, సీఎం కేసీఆర్ స్పంద‌న ఏ విధంగా ఉంటుంద‌ని కూడా కేంద్రం పెద్దలు గ‌వ‌ర్నర్ ని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఐతే...కేంద్రం నేరుగా జోక్యం చేసుకునే ప‌రిస్థితి కూడా ఇప్పుడే లేదని చ‌ర్చకి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఈ విషయంలో ఆచితూచి వ్యవ‌హ‌రించాల‌ని కేంద్రం సైతం గ‌వ‌ర్నర్‌కి ఉద్బోధ చేసిన‌ట్టు నార్త్‌బ్లాక్ వ‌ర్గాలు నుంచి తెలుస్తోంది. 


క్షేత్రస్థాయిలో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె తీవ్రత ఏ విధంగా ఉంద‌న్న విష‌యంపై మోడీ ఆరా తీసిన‌ట్టు స‌మాచారం. ప్రభుత్వం స్కూల్‌, కాలేజీలు, విశ్వ విద్యాల‌యాల‌కు సెల‌వు ప్రకటించిన విష‌యాన్ని గ‌వ‌ర్నర్ తమిళి సై మోడీకి తెలిపినట్లు సమాచారం. తెలంగాణ సర్కారు పోలీసులకు సెలవులను రద్దు చేసిన‌ట్టు తెలిపారు గవర్నర్. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బస్‌ డిపో, బస్టాండుతో పోలీసు బలగాలను మోహరించారని, అక్టోబర్ 19న తెలంగాణ బంద్‌ నేపథ్యంలో ఏర్పడే ప‌రిస్థితిపై కూడా ప్రధానికి గవర్నర్‌కు వివ‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే గవర్నర్‌ను కేంద్రం నివేదిక కోరడం సమస్య తీవ్రతను తెలుసుకోవడంలో భాగమని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేంద్రం కూడా ప్రస్తుతం సిద్ధంగా లేదని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: