వానా - వరద విలయంలో భాగ్యనగరం - మంత్రి & మేయర్ కుంభకర్ణ నిద్రలో ఉన్నారా!

మన పురపాలకశాఖ అమాత్యశేఖరులు కలవకుంట్ల తారక రామారావు, నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ - నగరం వరదల్లో అతలాకుతలం అవుతుంటే తప్ప - గతంలో నగరంలో పర్యటించిన సందర్భాలు బహు అరుదు. అధికారంలోకి వచ్చిన తొలి దశలో ప్రజలకు ఏదో మేలు చెసేవారిలా - జిహెచెంసీ అధికారులను వెంటేసుకొని ఉపన్యాసాలు దంచుతూ కాలం గడిపేశారు. వానా వరదలు తగ్గిన తరవాత సమస్యల పరిష్కారానికి ప్రయత్నించిన దాఖలాలే లేవు.  


సాధారణ పరిస్థితుల్లో బహుశ కుంభకర్ణుని తలపించేలా ఘాఢ నిద్ర పోతున్నారులా ఉంది. తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఉత్సవాలు, పండుగల నిర్వహణ  ప్రచారంలో మునగటం లేదా? లేకుంటే పలు సినిమాలకు ప్రచారకర్తల్లా ఆ సినిమా బాగుంది ఈ సినిమా బాగుందని కబుర్లతో మానేజ్ చేస్తూరు. కాని నగరంలోని రోడ్ల పరిస్థితి, మురుగు నీటి పారుదల, పరిశుభ్రతకై చేసిందేమీ కనిపించడంలేదు. నగరంలో దోమల స్వైరవిహారానికి అంతం లేదు – ఎన్నికల్లో గెలిచేంతవరకు ప్రచారంలో అది చేస్తాం ఇది చేస్తాం అని కాలం గడిపి, అధికారంలోకి రాగానే మళ్ళా కుక్కతోక వంకరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. 

2014 తెలంగాణా రాష్ట్రావతరణం తరవాత ఉద్యమపార్టీ టీఅరెస్ కేసీఆర్ నాయకత్వంలో, ముఖ్యమంత్రిత్వంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పురపాలక శాఖ నిర్వహిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి తనయులు, మంత్రి కేటీఆర్ నగర రహదారుల తీరు సమూలంగా తెలుసు. రహదారులు - గుంతలు, గోతులు, మాన్-హోల్సు ఆవురావురంటూ నరమాసం కోసం పరితపించే రక్కసి మూకల్లా నోరు తెరుచుకుని ఎవర్ని మింగేద్దామా అన్నట్లున్నట్లున్నవేళ  -  నిరంతరం నగరవాసి ప్రయాణం బహు ప్రమాద భరితంగా మారిన విషయం గుర్తించినా,  ఆ విషయంపై అంజాన్ కొట్టేసినట్లే ఉన్నారు. 


వర్షాలు వరదలు లేనప్పుడు గోతులు, గుంతలు, నోరు తెరుచుకున్న మాన్-హోల్సును పద్మవ్యూహంలో అభిమన్యునిలా తప్పించుకుంటూ రోజులెళ్ళ దీస్తున్నారు నగర వాహన చోదకులు, పాదచారులు. కాని వర్షాలు వరదలు మళ్ళా ఈ విశ్వనగరాన్ని ముంచెత్తించటంతో - ఇప్పుడు నగర రహదారులపై ఈ ప్రమాద కారకాలు - వర్షాలు వరదలతో పునరుత్తేజితమై ప్రజాబాహుళ్యాన్ని చీల్చి చెండాడటం మొదలెట్టాయి. 

ఒక ప్రక్క దోమల దండ్ల దాడులతో – పలు జబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ప్రజలను నరకయాతన పెడుతున్న వేళ, మురుగు నీటి మూసీ ప్రవాహం నడి రహదారులపై వెల్లువెత్తుతూ భూమిమీదనే నరకంలోక అనుభవం రుచి చూపిస్తున్నాయి. గత ఆరు ఏడేళ్ళుగా పురపాలక శాఖ నిర్వహించే మంత్రివర్యులు, నగర ప్రధమ పౌరుడు, ది గ్రేట్ జీహెచెంసి అధికారులంతా కలసి కూడా కనీసం మురుగునీటి వ్యవస్థను సరిదిద్దలేక పోవటం మన చేతగాని తనాన్ని ఋజువు చేస్తున్నాయి. ఇప్పుడు నగరంలో మురుగు నీరు, నాలాలు రహదారులు దాటి, నగరంలోని గృహాల్లోకే కాదు, అపార్ట్మెంట్ల సెల్లార్లను ముంచెత్తుతూ ఫ్లాట్ల ప్రాంగణంలోకి రానున్నట్లు కనిపిస్తుంది  


ఫురపాలక శాఖామాత్యులవారు దయచేసి:

*ఏరులైన రహదారులపై వరద నీటి  నిష్క్రమణకు దారులు చూపండి

*మురుగు నీటి ప్రవాహం నాల్లోనే ప్రవహించేలా చేయండి. రహదార్లపై మురుగు నీరు ప్రవహిస్తే ప్రజారోగ్యం సమస్యల్లో పడుతుందని గుర్తిస్తే చాలు

*రహదార్లను కనీసం ప్రయాణానికి అనుకూలంగా మార్చండి 



*హుసేన్ సాగర్ ఫుల్-టాంక్-లెవల్ మించి నిండు కుండలా, ఎప్పుడు ఏ ప్రమాదకర వార్తలు వినాల్సి వస్తుందో అనేలాగా భయపెడుతుంది. ఏమైనా జరిగితే వందలాది కాలనీల పరిస్థితి ఊహించలేము. వేలల్లో కాదు జనం పడబోయే అవస్థలను కాస్త ఊహించి ముందుగానే చర్యలు తీసుకుంటే మంచిది 

*నలభై శాతం చెరువులు ఆక్రమణలో ఉన్నాయి వీటిలో సింహభాగం నేపధ్యంలో రాజకీయ నాయకుల హస్తాలు పుష్కళంగా ఉన్నాయని అంటున్నారు. అదీ మంత్రి వర్యులకే కాదు సమస్త ప్రజానీకానికి తెలుసుట. 

తెలంగాణాలో నగర మరియు పురపాలక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడ మీరు నిద్రమత్తు వదలకపోతే కాగల కార్యం ప్రజలు ఈ సారి చూసుకోవటం గ్యారెంటీ అంటూ తమ ఆవేదనను కార్యాచరణ రూపంలోకి మార్చబోతున్నారట ఉద్యమింపజూస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: