జగన్ పాలనతో.. జనం "రివర్స్" ఎన్నికలు అడుగుతున్నారు

Chakravarthi Kalyan

జగన్ అసమర్థ పాలనతో జనం రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. జగన్ పాలనపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. జగన్ పరిపాలనలో అన్నీ రివర్స్ లో జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన పీపీఏ ల వ్యవహారంలో ఇంగిత జ్ఞానం ఉన్నవాలెవ్వరు తలదూర్చరని.. కానీ జగన్ మాత్రం అన్నింటినీ తిరగతోడతానంటున్నారని చంద్రబాబు అన్నారు.


పోలవరం ప్రాజెక్టుల వ్యవహారంలో జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు జరిపిస్తానంటున్నారని.. జగన్ తీరు చూసిన తర్వాత జనం కూడా రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండు అని కోరుకుంటున్నారని చంద్రబాబు కౌంటర్ వేశారు. అయితే రివర్స్ ఎన్నికలు రావు కానీ మూడేళ్లలో వస్తే జమిలీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అన్నారు.


చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే...” ప్రపంచ స్థాయి రాజధాని గా అమరావతి కి శ్రీకారం చుడితే పురిట్లోనే దానిని చంపేశారు.. అవినీతి లో చిక్కుకుని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నాడు.. గతంలోనూ నాపై 26కేసులు వేసి ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు.. నాపై అవినీతి ఇంకా దొరకలేదా అని అధికారులను, మంత్రుల్ని కోప్పడే స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు.. ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరించటానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ఈ సమావేశంలో అన్నారు.


జగన్ హయాంలో ఉన్నట్టు.. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంత అనాగరిక పరిస్థితులు లేవన్న చంద్రబాబు.. రాక్షసులు వూళ్ళ పై పడి ఇష్టానుసారం ప్రవర్తించే వాళ్ళని చరిత్రలో చదివాము .. వైకాపా ప్రభుత్వం రాక్షసుల్ని మైమరిపించే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. చేసే ధర్మపోరాటంలో న్యాయవాదుల అండ కోరుతున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 కేసులు అక్రమంగా తెలుగుదేశం వారిపై నమోదు చేశారని.. ప్రజల్లో ఈ ప్రభుత్వాన్ని నేరమయ ప్రభుత్వంగా నిలబెట్టే వరకూ వదిలేది లేదని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: