మందుబాబులకు జగన్ ఝలక్.. బాగా తగ్గించేస్తున్నాడుగా..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం జగన్ మందుబాబులకు ఝలక్ ఇస్తున్నారు. కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని నిరుత్సాహపరుస్తున్నారు. ఎన్నికలకు ముందు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి... ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.


నిన్న మొన్నటి వరకూ బెల్టు షాపులను పూర్తిగా కంట్రోల్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మందుబాబులకు షాక్ తగిలింది. ఇప్పుడు ఇప్పుడు కొత్త మద్యం విధానం ద్వారా జగన్ మరోసారి షాక్ ఇస్తున్నారు. ఈ కొత్త విధానంలో మద్యం షాపులను తగ్గించారు. అంతే కాదు మద్యం అమ్మకాల సమయాన్ని కూడా కుదించేశారు. దశలవారీగా మద్యపాన నిషేదంలో భాగంగా షాపుల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించింది.


అక్టోబర్‌ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ ఉంటుంది. 3500 షాపులను బేవరేజేస్‌ కార్పొరేషన్‌ నిర్వహించనుంది. 800కు పైగా మద్యం షాపులను ప్రభుత్వం తగ్గించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.


తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి మార్గంలో మద్యం షాపులు నిషేధించారు. శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా మద్యం షాపులు తొలగిస్తున్నారు. ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పుడు మందుబాబులకు రాత్రి 9 తర్వాత మందు దొరకడం కష్టమే అన్నమాట. తన ఐదేళ్ల పాలన పూర్తయ్యే నాటికి కేవలం స్టార్ హోటళ్లలోనే మద్యం లభించేలా చేయాలన్నది జగన్ లక్ష్యం. జగన్ పట్టుదల చూస్తే ఆ పని కూడా చేసేలా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: