సంచలనం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాస గృహానికి సంజాయిషీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ సారధ్యంలోకి రాగానే పాలనాపరంగా ముఖ్యంగా గృహనిర్మాణ రంగంలో విధివిధానాలు అనుసరించకపోతే జరగనున్న దుష్పరిణామాల రుచి చూస్తుంది. తొలుతగా ప్రభుత్వ కట్టడమైన "ప్రజావేదిక" అనుమతుల పరిధిలో లేకుండా నిబంధనలను అతిక్రమించి నిర్మించారని ఆఖరికి అది ప్రభుత్వ కట్టడమైనా దాన్ని కూల్చేసిన సందర్భంలో ఇక ప్రయివేట్ కట్టడాలకు ఎలాంటి అతిక్రమణలను క్షమించబోమని - కూల్చివేయటంలో ఎలాంటి దయాదాక్షిణ్యాలకు తావులేదని సంకేతాలిచ్చినట్లే నని తేలిపోయింది.    


 కృష్ణానది కరకట్ట లోపల అంటే నదీ గర్భంలోకి త్రోచుకువచ్చి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు అధికార వైసీపి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత ప్రతిపక్ష నేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని అథిధిగృహం అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన "రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ-సీఆర్‌డీఏ" శుక్రవారం (నేడు) తొలుత సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నివాస బయట వైపు గోడకు దాని యజమాని లింగమనేని రమేష్ పేరు తో అధికారులు నోటీసులు అంటించారు.


చంద్రబాబు నివాసంతో పాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని "సీఆర్‌డీఏ సెక‌్షన్‌ 115(1)115(2)" కింద నోటీసులు జారీచేశారు. వారంరోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠినచర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయం లో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదిక అది ప్రభుత్వ భవనమైనా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయటానికి ఆయన ఆదేశాలు జారీ చేయగా ఆ మేరకు ఇప్పటికే ఆ భవనాన్ని కూల్చివేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: