ఎడిటోరియల్ : రాబోయే ఎన్నికల్లో ఎవరి నమ్మకం గెలుస్తుంది ?

Vijaya

అవును ప్రధాన పార్టీల అధినేతలు ఇద్దరు చెరో నమ్మకంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఓట్లలో చీలిక వచ్చి మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతానన్నది చంద్రబాబునాయుడు నమ్మకం. అదేవిధంగా ఒంటిరిపోరే వైసిపిని రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తుందన్నది జగన్మోహన్ రెడ్డి నమ్మకం. ఇద్దరు ఎవరికివారుగా తమ నమ్మకమే గెలవాలంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. సరే మధ్యలో ఎటూ జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఉంటాయనుకోండి అది వేరే సంగతి. మొత్తం మీద ప్రధాన పార్టీల అధినేతల నమ్మకంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతోంది.


నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది జనాల్లో. మామూలుగా అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచే అవకాశం లేదు. అందుకనే తనకు మద్దతుగా నిలవమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గోకుతున్నారు చంద్రబాబు. తాను రానుపొమ్మంటున్నా వదలకుండా పవన్ ను గోకుతునే ఉన్నారు. అదే సమయంలో సీట్ల సర్దుబాటు కోసమంటూ విశాఖపట్నంలో పవన్ వామపక్షాల జాతీయ నేతలతో సమావేశం పెట్టారు. దాంతో చంద్రబాబుకు కొంత ఇబ్బందిగానే ఉంది. ఒకవేళ పవన్ గనుక చంద్రబాబుతో పోవటానికి ఇష్టపడకపోతే అంతే సంగతులు.

 

ఒంటరి పోరాటానికి సిద్ధపడుతున్న చంద్రబాబు ఓట్ల చీలికపైనే ఆశలు పెట్టుకున్నారు. వైసిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్ ఏ పార్టీకి ఆ పార్టీ అన్నీ సీట్లలోను పోటీ చేస్తే అంతిమంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలుగుదేశంపార్టీనే లాభపడుతుందని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎంతగా చీలితే అధికార పార్టీ అంతగా లబ్దిపొందుతున్నది వాస్తవం. కానీ వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఆ పరిస్ధితుందా అన్నదే అనుమానం.

 

ఇక, జగన్ విషయానికి వస్తే తమకు ఏ పార్టీతో కూడా పొత్తు అవసరం లేదని మొదటి నుండీ చెబుతునే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపిది ఒంటరిపోరేనంటూ ఇఫ్పటికే చాలాసార్లు ప్రకటించారు కూడా. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే అధికార పార్టీకే లాభమన్న విషయం జగన్ కు తెలీకుండానే ఉంటుందా ? అయినా ఒంటరి పోరాటానికే సిద్ధపడుతున్నారంటే ఏమనర్ధం ? ఇక్కడే జగన్ చిన్న లాజిక్ చెబుతున్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బిజెపిలు కలిసి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా తెచ్చుకున్న ఓట్లు వైసిపితో పోల్చుకుంటే కేవలం 5 లక్షలు మాత్రమే ఎక్కువ.

  

అదే 2019 ఎన్నికల విషయం చూస్తే చంద్రబాబు, పవన్, బిజెపిలు ఏ పార్టీకి ఆపార్టీ విడిగా పోటీ చేసే అవకాశాలు ఇప్పటికైతే కనిపిస్తున్నాయ్. అంటే పోయిన ఎన్నికల్లో ఉమ్మడి తెచ్చుకున్న ఓట్లే రానున్న ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య చీలిపోతాయన్నది జగన్ ఆలోచన. పోయిన ఎన్నికల్లో వైసిపికి వచ్చిన ఓట్లును మళ్ళీ తెచ్చుకోగలిగితే కూడా చాలట. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎలాగూ తనకే పోలవుతాయన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. కాబట్టి ఏ పార్టీతో పొత్తు లేకపోయినా వైసిపి విజయం ఖాయమనే ధీమాతో జగన్ ఉన్నారు. లాజికల్ గా అయితే ఇద్దరి నమ్మకాలు కరెక్టే. అందుకే ఇద్దరిలో ఎవరి నమ్మకం గెలుస్తుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: