పిన్నెల్లి రచ్చ చిన్నదేం కాదు.. 7 ఏళ్ళు శిక్ష గ్యారంటీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. దీని అంతటికి కారణం మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చ. మంగళవారం రాత్రి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. తీవ్ర ఆగ్రహంతో పోలింగ్కు సంబంధించిన ఈవీఎం బాక్స్ ను ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మార్చి 13వ తేదీన ఏపీలో పోలింగ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.
అయితే పోలింగ్ కేంద్రం బయట ఏం జరిగిందో తెలియదు కానీ... ఆయన పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి... అధికారుల ముందే... ఈవీఎం బాక్సులను నేలకేసి కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే... ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. వెంటనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా ఇచ్చింది.
దీంతో హైదరాబాద్ మహానగరంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే తాజాగా ఈ సంఘటనపై ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A 1 ముద్దాయిగా చర్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సంఘటన నేపథ్యంలో మొత్తం పది సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామని వివరించారు.
ఈ కేసులో ఏడు సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని ఆయన బాంబు పేల్చారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని... ఇలాంటి సంఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని... ఏ క్షణమైనా అతన్ని అరెస్టు చేస్తామని ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: