లగడపాటి – ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సర్వే ఇప్పుడే ఎందుకు..? ఏంటి ప్లాన్..?

Vasishta

          రెండ్రోజుల క్రితం లగడపాటి రాజగోపాల్ టీం చేసిన RG ఫ్లాష్ సర్వే అంటూ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఓ సర్వేను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఊహించినట్టే ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీదే అధికారమని తేలింది. ప్రతిపక్ష వైసీపీకి మళ్లీ పరాభవం తప్పదని నిర్ధారించింది. ఇది ఓకే..! అసలు ఈ సర్వేను ఇప్పుడే ఎందుకు చేపట్టిందనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం.


          లగడపాటి రాజగోపాల్ చాలాకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు సర్వే చేస్తున్నారన్న సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకోసమే ఆయన ఈ సర్వే చేస్తున్నారనే విషయం వారిద్దరి అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసు. అడపాదడపా లగడపాటి రాజగోపాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి తన సర్వే వివరాలను నేరుగా ఆయనకే అందిస్తున్నారు. ఆ సర్వే ఆధారంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. అందుకే పలు సందర్భాల్లో ఈసారి కూడా తమదే అధికారమని, రాష్ట్రంలో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్తూ వస్తున్నారు.


          లగడపాటి సర్వే నిరంతర ప్రక్రియ అయిన నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడే సర్వేను ఎందుకు బయటపెట్టిందనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముంది. సాధారణంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఇలాంటి సర్వేలు చేయడం చాలా కామన్. అయితే ఆంధ్రజ్యోతి పనిగట్టుకుని ఇప్పుడు సర్వేను బయటపెట్టడం వెనుక కొన్ని కారణాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా ఈ సర్వేను బయటపెట్టిందనేది విశ్లేషకుల మాట. తాము బలపడ్డాం.. చంద్రబాబు సర్కార్ అబద్దాలు చెప్తోంది.. మేం చాలా చేశం.. ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారు.. లాంటి అనేక మాటలు ఇటీవలికాలంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అలాంటివారికి సర్వే ద్వారా నోరు మూయించాలనేది ఓ ఉద్దేశం.


          ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని చాటిచెప్పేందుకు ఈ సర్వే దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సర్వే చెప్పకపోయినా బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని పూడ్చుకోవడం బీజేపీకి అంత ఈజీ కూడా కాదు. అయితే బీజేపీతో అంటకాగడం ద్వారా వైసీపీ కూడా దెబ్బతింటోదని ఈ సర్వే ద్వారా అర్థమవుతోంది. ప్రత్యేక హోదా విషయంలో బాబు యూటర్న్ తీసుకున్నారని, తాము మాత్రమే మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నామని జగన్ చెప్తున్నారు. మరి దాని ఫలితం ఓట్లలోకానీ, సీట్లలో కానీ ప్రతిబింబించకపోగా మరింత నష్టపోతున్నట్టు తేటతెల్లమైంది. ఆంధ్రజ్యోతిలో ఈ సర్వే వచ్చింది కాబట్టి చాలా మంది వైసీపీ నేతలు దీన్ని పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. అయితే లగడపాటి సర్వే కచ్చితత్వానికి మారుపేరు. ఇది నిజంగా అబద్దాల సర్వే అయితే లగడపాటి ఈ పాటికే ఖండించేవారు. ఆయన స్పందించలేదు కాబట్టి దీన్ని నమ్మక తప్పదేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: