కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం..గద్దర్ తనయుడు సైతం !

siri Madhukar
ఎట్టకేలకు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు గద్దర్ తనయుడు సూర్య కిరణ్ కూడా బీజేపీ పార్టీని వీడి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిరువురు  ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్ గాంధీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు వేములవాడకు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ లో చేరారు.  ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌తో సహా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు ఉన్నారు. 

కాగా, కొంత కాలంగా బీజేపీలో ఉన్న నాగం తాను తెలంగాణ అధికార పార్టీపై పోరాడుతూ వస్తున్నానని..తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ దొరల పాలన మొదలైందని..ఇప్పటికే పేదవారు పేదవారిగానే..ధనికులు ఇంకా ధనవంతులు గా మారిపోతున్నారని అన్నారు.  అయితే తెలంగాణ ఇచ్చింది అప్పటి యూపీఏ ప్రభుత్వం అని కానీ టీఆర్ఎస్ తానే పోరాడి తెచ్చినట్లు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు.

అయితే టీడీపీ వీడిన తర్వాత నాగం బీజేపీలో జాయిన్ అయ్యారు..కానీ అక్కడ ఆయనకు తగినంత గౌరవం దక్కక పోవడంతో బీజేపీతో సంబంధాలను తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదించిన తరువాత నాగంకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్న్‌ల్‌ లభించింది.

కాంగ్రెస్ నాయకులు డికె అరుణ, దామోదర్ రెడ్డిలు నాగం చేరికను వ్యతిరేకిస్తున్నప్పటికీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పలేదు.చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2013లో టీడీపీని వీడి, సొంత పార్టీ తెలంగాణ నగారా సమితిని స్థాపించాడు. ఆతరువాత 2014లో బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ తరఫున 2014 సాధారణ ఎన్నికలలో మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఆయన కొద్ది వారాల క్రితం బీజేపీని వదిలి, కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: