అనంత టీడీపీలో రాజుకున్న అసమ్మతి సెగ!

Vasishta

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కటిగా  బహిర్గతమవుతున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లను ఆశిస్తున్న వారితో పాటు నామినేటేడ్ పదవులు ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్ళు.. అవకాశాలకు అనుగుణంగా స్వరం మారుస్తున్నారు. నాలుగేళ్ళ పాటు కిమ్మనని తమ్ముళ్ళు సీనియర్లకు న్యాయం జరగడంలేదని, బయటి నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యతనిస్తున్నారంటూ అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అనంతపురం నియోజక వర్గంలో టీడీపీ ద్వితీయశ్రేణి నేతల అసమ్మతి సమావేశాలు నిర్వహించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


అనంతపురం నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పార్టీలో నెలకొన్న అసమ్మతి బహిర్గతమైంది. మాజీ ఎంపీ సైఫుల్లా నివాసంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జక్కీవుల్లా నాయకత్వంలో నగర నేతలు, కార్పోరేటర్ల బంధువులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమకు సముచిత గౌరవం లభించడంలేదని.. ముఖ్యనేతలకు నమ్మినబంట్లుగా ఉన్న వారికే నామినేటేడ్ పోస్టులు లభిస్తున్నాయనే వాదనలు వినిపించాయి.


వచ్చే ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థికి అనంతపురం అసెంబ్లీ టికెట్ కేటాయించాలంటూ కొందరు బాహాటంగానే లేవనెత్తారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిసి 15వ తేదీన తమ అభిప్రాయాలు వెల్లడిస్తామని, అధినేత నిర్ణయానికి అనుగుణంగా తమ కార్యచరణ ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి జకీవుల్లా వర్గం ప్రకటించింది. అందుకు ప్రతిగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం.. మున్సిపల్ అతిథి గృహంలో సమావేశమైంది. సైఫుల్లా కుటుంబానికి పదవులు కేటాయింపులో అన్ని విధాలా సముచిత స్థానం కల్పించిందని అయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం సరికాదని విమర్శలు గుప్పించింది.


వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తూ టీడీపీపై విమర్శలు చేస్తున్న నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రభాకర్ చౌదరి వర్గం డిమాండ్ చేసింది. అయితే తెలుగు తమ్ముళ్ళ అసమ్మతి సెగలను చల్లార్చేందుకు టీడీపీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. బహిరంగ విమర్శలు, సమావేశాలు నిర్వహించ వద్దని ఆదేశించింది.  ఎన్నికల సమయం సమీపించే కొద్దీ అసమ్మతి సెగలు మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: