ఛాన్స్ దొరికితే చంద్రబాబు దుమ్ము దులిపేందుకు వెయిట్ చేస్తున్న మంత్రులు..!!

Vasishta

చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అందరూ హడలిపోవడం గతంలో మనం చూసాం. ముఖ్యంగా అధికారులెవరూ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భయపడిపోయేవారు. ఒకటికి రెండుసార్లు చర్చించి నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారు ఆడిందే ఆట.. పాడిందే పాట.. అందుకే మంత్రులు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.


ఏపీలో అధికారులు ముఖ్యమైన వాటికి సంబంధించిన కనీస సమాచారం మంత్రులకు ఇవ్వకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పోలీసు ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపన విషయంలో అధికారుల నిర్లక్ష్యం వైఖరి మరోసారి బయటపడింది. స్వయానా రాష్ట్ర హోమంత్రినే కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం పెద్ద దుమారాన్నే రేపింది. హోంమంత్రికే కాదు.. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి..


కొన్ని కీలక శాఖల్లో అధికారులు మంత్రులతో తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే కొన్ని శాఖల్లో అసలేం జరుగుతుందో ఆ శాఖ మంత్రికే తెలియని పరిస్థితి ఉంది. అధికారుల తీరు నచ్చని కొందరు మంత్రులు సచివాలయానికి రాకుండా సొంత నియోజకవర్గాల్లోనే ఉండిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.. హోంశాఖలో తాజాగా జరిగిన సంఘటనే కాకుండా సీనియర్ మంత్రుల శాఖల్లోనూ ఇదే తంతు నడుస్తోంది.. కొన్ని శాఖల్లోని కీలక పదవుల్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు మంత్రులను పిలవకుండానే ఆ శాఖలోని కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఈ సమావేశాల్లో తీసుకునే కీలక నిర్ణయాలను నేరుగా CMOకు పంపిస్తుండటంతో.. అధికారుల తీరు పట్ల మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


తమకు విలువ ఇవ్వడంలేదని ఓవైపు మంత్రులు అధికారుల తీరుపై అసహనంతో ఉంటే సీఎం స్వయంగా వివిధ శాఖల HODలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తుండటంతో ఏ విషయాన్నయినా అధికారులు స్వయంగా సీఎంకు చెబుతున్నారు. అలాగే మంత్రులు చెప్పే కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ విషయంలోనూ మంత్రుల ఆదేశాలను శాఖాధిపతులు పాటించడంలేదు. ఏదైనా ఫైల్ స్టేటస్ గురించి  మంత్రులు అధికారులను అడిగితే దాని గురించి సీఎంకు చెప్పామని.. వాటి గురించి తరువాత చూద్దామన్నారంటూ సమాధానాలు రావడంతో మంత్రులు అవాక్కవుతున్నారు. నిజంగా అధికారులకు సీఎం చెప్పారో లేదో క్రాస్ చేసుకోవాలంటే సీఎంతో మాట్లాడాలి.. దీంతో సీఎంను నేరుగా అడుగలేక తమలో తామే మధననపడుతున్నారు.


మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని నిర్మాణ పనులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుండటంతో ఆ శాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నా గుంటూరు కేంద్రంగా పనిచేసే ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతుండటంతో తమ సమస్యలు మంత్రికి చెప్పుకున్నా ఉపయోగం లేకుండాపోతోందని మున్సిపల్ శాఖలోని కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ శాఖలో ఏ GO రిలీజ్ చెయ్యాలన్నా గుంటూరు కేంద్రంగా ఉండే ఉన్నతాధికారి CMO అధికారులకు పంపించి ప్రిన్సిపల్ సెక్రటరీతో జారీ చేయిస్తున్నట్లు సమాచారం. దీంతో తనకు విలువనివ్వడంలేదని భావిస్తున్న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సచివాలయం సమాచారం.


సీఎం చంద్రబాబు శాఖాపరమైన ప్రొగ్రెస్ కోసం తరుచూ సమీక్షలు నిర్వహిస్తుంటే.. అధికారులు దానిని అవకాశంగా తీసుకొని మంత్రులను లెక్కచేయడంలేదనే వాదన వినిపిస్తోంది. కొంతమంది అధికారులు CMOతో సాన్నిహిత్యం పెంచుకుని మంత్రిత్వ శాఖలను తమ కన్నుసన్నల్లో నడపడం మంత్రులకు మింగుడు పడటంలేదు. దీనిపై సీఎం స్పందించి అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలని మంత్రులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: