ఔను.. ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత బావమరిది, వియ్యంకుడు అయిన హిందూపూర్ ఎమ్మెల్యే, నందమూరి తారక రామారావు నట వారసుడు అయిన నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురింపించారు. బాలకృష్ణ సినిమాలలోనే కాదు.. నిజ జీవితంలో పేదల ప్రాణాలు కాపాడే హీరో అంటూ తెగ మెచ్చుకున్నారు. ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు..
అంతవరకూ బాగానే ఉంది. కానీ ఎందుకు బాలయ్యను చంద్రబాబు అంతగా పొగిడారు.. బాలయ్య చంద్రబాబు అధ్యక్షుడుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యే. అందుకే ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ పనితీరు తెగ నచ్చేసి పొగిడి ఉంటారా.. అంత సీన్ లేదు. ఎందుకంటే బాలయ్య అసలు సొంత నియోజకవర్గం వైపే పెద్దగా వెళ్లడం లేదని అక్కడి జనం ఆగ్రహంగా ఉన్నారట.
మరి ఇటీవలి జాతీయ సినిమా అవార్డుల్లో ఏమైనా బాలయ్య సినిమాలకు వచ్చాయా.. అది కూడా కాదు. ఒక నటుడిగా.. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఆయన మానవతావాదిగా చంద్రబాబు మనసు గెలుచుకున్నారు. ఔను.. హైదరాబాద్ లోని బసవతారకం కాన్సర్ ఆస్పత్రికి బాలయ్య ఛైర్మన్. ఈ ఆసుపత్రి ఎందరో రోగుల ప్రాణాలను కాపాడుతోంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ కు చికిత్స అందిస్తోంది.
ఈ ఆసుపత్రి సేవలను గతంలో ఎందరో ప్రశంసించారు. నందమూరి తారక రామారావు భార్య బసవతారకం క్యాన్సర్ తోనే కన్నుమూశారు. తనలా క్యాన్సర్ తో బాధపడే రోగులకోసం ఏమైనా చేయాలని ఆమె కోరినందువల్లే క్యాన్సర్ ఆసుపత్రి కట్టారట. ఈ ఆసుపత్రిని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకే చంద్రబాబు బాలయ్యఅను అంతగా పొగిడారు. ఈ ఆసుపత్రిలో పేదలకోసం నిర్మించిన వసతి గృహాన్నిచంద్రబాబు ప్రారంభించారు.