‘బీకాం ఫిజిక్స్’తో చాలా గుర్తింపు వచ్చింది...!!
ఏ ముహూర్తానా టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాం లో ఫిజిక్స్ ఉంటుంది అన్నాడో గానీ, అప్పటినుండి ఆయనపై సోషల్ మీడియా లో జోకులు తెగ పేలుతున్నాయి. అప్పటినుంచి నెటిజన్లు జలీల్ ఖాన్ ను ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నారు. ఆ వ్యవహారం తనకు మేలే చేసిందని.. తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. మీడియాతో రివర్స్‌లో మాట్లాడితేనే బాగా చూపిస్తారని, అందుకే బీకాంలో ఫిజిక్స్ ఉందని అన్నట్లు తెలిపారు.
అసెంబ్లీ లాబీల్లో ఆయన్ను వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఫిజిక్స్ ఎలా ఉందన్నా అని వ్యంగ్యంగా అడిగారు. తాజాగా మంగళవారం అసెంబ్లీ లాబీల్లో జలీల్‌ఖాన్ ఫిజిక్స్ హాట్‌టాపిక్ అయింది. అసెంబ్లీకి వచ్చిన జలీల్‌ఖాన్ ఉదయం 11 గంటల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీల్లోకి వచ్చారు. ఆయన్ను చూసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించారు. దీంతో ఆయన అక్కడే ఆగిపోయారు.
రోజాతో పాటు మిగతా మహిళా ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పుష్పశ్రీవాణి, వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి తదితరులు ఆయన దగ్గరకు వచ్చారు. ‘మేము ధర్నాలు చేసినా, పోలీసులు అరెస్టులు చేసినా మాకు అంత పాపులారిటీ రాలేదు, మీరు కామర్స్‌లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పగానే మీకు ఎవరూ ఊహించనంత పాపులారిటీ వచ్చింది..’ అంటూ రోజా ఛలోక్తి విసిరారు. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ పరోక్షంగా బీకాం లో ఫిజిక్స్ చదివిన వారికి మా లెక్కలు అర్థం కావని ఆయన చలోక్తులు సైతం విసిరారు.