జగన్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించే ఆలోచన..!?

Chakravarthi Kalyan
కాపు గర్జన సభ రోజు జరిగిన హింసా, అరాచక కాండ ఆంధ్రాలో విపరీత రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందా.. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని విపక్షనేత జగన్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించే ఆలోచన అధికార పార్టీ చేస్తోందా.. జగన్ ను అసెంబ్లీకి రానివ్వకుండా చేసేందుకు ఇదే మంచి అవకాశం అని టీడీపీ భావిస్తోందా.. అన్న అనుమానాలు కొందరు టీడీపీ నేతల మాటలు వింటే కలుగుతోంది. 

తునిలో హింసాకాండ జరిగిన రాత్రి పెట్టిన ప్రెస్ మీట్లోనే చంద్రబాబు ఈ ఘటనకు జగనే కారకుడిగా తేల్చేశారు. అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా రౌడీయిజం చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. జగన్ పేరు పెట్టకపోయినా.. మీ తండ్రి రిజర్వేషన్ ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించడం ద్వారా తాను తిడుతున్న నేరగాడు ఎవరో చెప్పకనే చెప్పేసారు. 

మొన్నటికి మొన్న సీఎం ను కాల్ మనీ సీఎం అన్నందుకు సభ నుంచి 3 నెలల పాటు బహిష్కరించారు. ఘటన జరిగిన తర్వాత రోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టి.. ఏకంగా స్పీకర్ వంగవీటి రంగా హత్యకేసు కారకుడని విమర్శించారు. మరి దీనికి జగన్ కు ఎంత శిక్ష విధించొచ్చు. అందుకే జగన్ పై మిగిలిన అసెంబ్లీ మొత్తం కాలానికి బహిష్కరణ వేటు వేసే ఆలోచన చేస్తోందా..? 

కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత లింగారెడ్డి కామెంట్లు చూస్తుంటే టీడీపీ అంతపని చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగన్ ను శాసనసభనుంచి బహిష్కరించాలని చంద్రబాబు నాయుడును కోరారు. అలా ఓ తీర్మానం చేయాలని లింగారెడ్డి కోరారు. రోజాను సస్పెండ్ చేసే ముందు వంగలపూడి అనితతో తీర్మానం చేయించారు. మరి ఇప్పుడు కూడా తీర్మానం చేయించి జగన్ ను మిగిలిన కాలానికి బహిష్కరిస్తారా.. అంత సాహసానికి టీడీపీ ఒడిగడుతుందా.. చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: