పసుపు మీడియాకు ఈ వార్త ఎందుకు కనిపించలేదో..!?

Chakravarthi Kalyan
నాదీ.. మోడీదీ సక్సస్ ఫుల్ జోడీ.. నాదీ బాబుదీ డెవలప్ మెంట్ టీమ్.. ఇవీ అటు ప్రధాని మోడీ.. ఇటు ఆంధ్రా సీఎం పదే పదే చెప్పిన మాటలివి. జనం కూడా అదే మాట నమ్మారు. బాబు ఇచ్చిన హామీలకు తోడు.. ప్రధాని మోడీ చరిష్మా కూడా ఆంధ్రాలో గెలుపుకు పనికొచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పంచన ఉంటే నిధులు బాగా రాబట్టుకోవచ్చన్న బాబు మాటలు బాగానే వర్కవుట్ అయ్యాయి. 

కానీ.. ఈ హిట్ పెయిర్ అధికారంలోకి వచ్చాక సామాన్యుడికి ఒరిగిందేముందీ అని వెనక్కు తిరిగి చూసుకుంటే అసంతృప్తే మిగులుతుంది. బతుకుల్లో కొత్త వెలుగు రాకపోగా.. సామాన్యుడి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టైంది. ఎన్నికలకు ముందు వచ్చేవన్నీ ఇక అచ్చేదిన్ అంటూ ఊరించిన మోడీ సర్కారు పాలనలో ఇప్పుడు కామన్ మేన్ కు చచ్చేదిన్ కానుకగా లభించాయి. 

మోడీ, బాబు గార్ల చల్లనిపాలనలో ధరలు మాత్రం మండుటెండలను తలపిస్తున్నాయి. సామాన్యుడు నిత్యం వాడే ఒక్క కందిపప్ప ధర చాలు.. జనానికి అచ్చేదిన్ వచ్చాయో.. చచ్చేదిన్ వచ్చాయో చెప్పడానికి.. అబ్బే.. కిలో కందిపప్పు కేవలం 140 రూపాయలకే రాయితీలో ఇస్తున్నాం అని ప్రభుత్వం చెబుతుంటే.. ఆహా ఎంత దయగల సర్కారో అని జనం మెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

ఐతే.. పరిస్థితులు ఇలా ఉంటే పచ్చ పత్రికలు మాత్రం ఇంకా బాబుగారి సుపరిపాలనను కీర్తించే మత్తులోనే ఉండిపోయాయి. ఎందుకంటే.. సర్కారు రాయితీ సరుకుల అండతో బతుకుబండి లాగించే బడుగు బతుకులపైన సర్కారు వేసిన కొండంత బండ పచ్చ మీడియాకు ఏమాత్రం కనిపించలేదు. రేషన్ కార్డుపై రాయితీపై ఇప్పటివరకూ సర్కారు 50 రూపాయలకు కందిపప్పు అందిస్తోంది.

బహిరంగ మార్కెట్లో 200 రూపాయలు పెట్టి కిలో కందిపప్పు కొనలేని వాళ్లు.. సర్కారు ఇచ్చే రాయితీ కంది పప్పుపైనే కొండంత ఆశ పెట్టుకున్నారు. అయితే ఈ కష్టకాలంలోనూ సామాన్యుడిని వదలని సర్కారు పెద్దలు ఆ రాయితీ కందిపప్పు ధర ఒక్కసారిగా 40 రూపాయలు పెంచేసింది. సాధారణంగా ఇలాంటి రాయితీ సరుకుల ధరలు పది రూపాయలు పెరిగితేనే గతంలో మీడియా రచ్చ చేసేది.. కానీ ఇప్పుడు ఏకంగా బడుగుల రాయితీ పప్పు ధరను ఏకంగా రెట్టింపు చేసినా పాపం.. పసుపు మీడియాకు అది వార్తకాలేక పోయింది. ఎక్కడో ఓ మూలన నాలుగు లైన్ల వార్త వేసి చేతులు దులుపుకున్నారు. అదే తమకు నచ్చని సర్కారు పాలనలో అయితే ఎంత రచ్చ చేసేవారో..!?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: