అమరావతి : మామా కోడళ్ళపై సీఐడీ చీటింగ్ కేసు

Vijaya


మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ చెరుకూరి శైలజపై సీఐడీ చీటింగ్ కేసులు నమోదుచేసింది. 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం డిపాజిట్లు సేకరించటమే కాకుండా సేకరించిన నిధులను స్పెక్యులేటివ్ మార్కెట్ లోకి తరలించటంతో పాటు చిట్ ఫండ్ యేతర అవసరాలకు తరలించినట్లు తేలటంతో రామోజీ, శైలజతో పాటు కొన్ని బ్రాంచ్ ల మేనజర్లు తదితరులపై కేసులు నమోదుచేసింది. వీళ్ళందరిపై సెక్షన్ 120 బీ, 409, 402, 477 (ఏ), రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసింది.



నిబంధనలకు విరుద్ధంగా రామోజీ ప్రజలనుండి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా సంవత్సరాలుగా కోర్టుల్లో ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. సేకరిస్తున్న వేల కోట్లరూపాయల డిపాజిట్లను చిట్ ఫండేతర వ్యవహారాలకు మళ్ళిస్తున్నారని కూడా ఉండవల్లి చాలా ఆధారాలను కోర్టుకు అందించారు.  దాదాపు 20 సంవత్సరాలుగా కోర్టుల్లో జరుగుతున్న విచారణ నత్తనడకను తలపిస్తున్నదంటే అతిశయోక్తికాదు.



చివరకు రాష్ట్ర విభజన సమయంలో ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. అయితే ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఉండవల్లి మళ్ళీ సుప్రింకోర్టులో రివిజన్ వేశారు. దాంతో కేసు మళ్ళీ సుప్రింకోర్టులో మొదలైంది. హైకోర్టులో కేసు కొట్టేసేటప్పుడు కనీసం తనకు కూడా సమాచారం అందకుండా రామోజీ అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉండవల్లి ఆరోపించారు. ఒక లాయర్ ద్వారా విషయం తెలుసుకుని కేసును మళ్ళీ సుప్రింకోర్టులో రీ ఓపెన్ చేయించినట్లు చెప్పారు. తర్వాత ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది. దాంతో ఉండవల్లి పోరాటానికి గట్టి మద్దతు దొరికింది.



ఈ విషయాలన్నీ పక్కనపెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ ప్రతిరోజు వార్తలు, కథనాలను అదేపనిగా వండివారుస్తున్నారు. చిన్న ఘటనను కూడా బూతద్దంలో చూపిస్తున్నారు. ఈరోజు రాయటానికి ఏమీ దొరక్కపోతే పాత స్టోరీలనే తిరిగి బ్యానర్ కథనాలుగా అచ్చేస్తున్నారు. దాంతో ప్రభుత్వానికి రామోజీకి బహిరంగంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మార్గదర్శి మోసాలంటు సీఐడీ కూడా మంచి దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగమే రామోజీ ఆయన కోడలు శైలజ తదితరులపై నమోదైన కేసులు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: