శ్రీ‌కాకుళం వార్త : తెర‌పైకి కొత్త జిల్లా? ఉద్య‌మం షురూ!

RATNA KISHORE

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ స్ప‌ష్ట‌తా లేదు. కొన్ని చోట్ల వీటిపై కొంత ఆందోళ‌న కూడా నెల‌కొని ఉంది. ఈ ద‌శ‌లో కొత్త కొత్త ప్ర‌తిపాద‌న‌లు కొన్ని తెర‌పైకి వ‌స్తున్నాయి. వాటి కార‌ణంగా ఉద్య‌మాలు  పురుడు పోసుకుంటున్నాయి. ఎప్ప‌టి నుంచో శ్రీకాకుళం జిల్లా కు సంబంధించి ఓ ప్ర‌తిపాద‌న ఉంది. పార్ల‌మెంట్ నియోజక‌వ‌ర్గాన్ని జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని సీఎం జ‌గ‌న్ అ నుకుంటున్నారు. ఆ విధంగా జిల్లాగా ప్ర‌క‌టిస్తే ఎచ్చెర్ల నుంచి కొన్ని అభ్యంత‌రాలు వ‌స్తున్నాయి. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి చేరువ గా ఎచ్చెర్ల ఉన్న‌ప్ప‌టికీ,ఆ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉంది.



 దీంతో త‌మ‌ను విజ‌య న‌గ‌రం జిల్లాలో క‌ల‌ప‌వ‌ద్ద‌ని, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అనుస‌రించి కొత్త జిల్లాల ఏర్పాటు ఉన్న‌ప్ప‌టికీ ఈ ఒక్క విష‌య‌మై మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేష‌న్ హ‌బ్ గా, ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్ గా గ‌త ప్ర‌భుత్వాలు తీర్చిదిద్దాయి అని, ఇక్క‌డే అనేక కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలు ఉన్నాయి అని, అదేవిధంగా బీఆర్ ఏయూ, ట్రిపుల్ ఐటీ కూడా ఉంద‌ని క‌నుక త‌మ‌ను విజ‌య‌న‌గ‌రంలో చేరిస్తే పాల‌నా సంబంధ స‌మ‌స్య‌ల‌ను చ‌వి చూస్తామ‌ని వారంతా గగ్గోలు పెడుతున్నారు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఈ విష‌య‌మై ఎచ్చెర్ల ప్ర‌జ‌ల‌తోనే ఏకీభ‌విస్తున్నారు. డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ దాస్  ఇటీవ‌లే ఇక్క‌డ రాజుకుంటున్న వివాదంపై క్లారిటీ ఇచ్చారు. శ్రీ‌కాకుళం జిల్లాలోనే ఎచ్చెర్ల ఉంటుంద‌ని, జిల్లాల ఏర్పాటుతో ఇక్క‌డి వారికి న‌ష్టం చేయ‌మ‌ని చెప్పారు. మ‌రోవైపు టెక్క‌లి, పాల‌కొండ రెవెన్యూ డివిజ‌న్ల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ ఒక‌టి వినిపిస్తోంది. 





ముఖ్యంగా టెక్క‌లి రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న టెక్క‌లి, ప‌లాస, ఇచ్ఛాపురం నియోజ‌క‌వ‌ర్గాల‌తో కూడిన జిల్లాను ఏర్పాటు చేయాల‌ని అడుగుతున్నారు. అదేవిధంగా పాలకొండ రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ఉన్న పాల‌కొండ, రాజాం, పాత‌ప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల‌తో మ‌రో జిల్లాను ఏర్పాటు చేయ‌మ‌ని డిమాండ్  చేస్తున్నారు. ఇవి కార్య‌రూపం దాలుస్తాయో లేదో కానీ ఎప్ప‌టి నుంచి శ్రీ‌కాకుళం జిల్లా మొద‌లుకుని ప‌శ్చిమ గోదావ‌రి వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న ఐదు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల‌ను క‌లిపి (పాల‌కొండ, పార్వ‌తీపురం, అర‌కు, రంప‌చోడ‌వ‌వ‌రం, పోల‌వ‌రం ఐటీడీఏల ప‌రిధిలో ఉన్న ప్రాంతాల‌ను క‌లిపి) మ‌న్యం జిల్లా ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు. ఇవి కాకుండా విజ‌య‌న‌గ‌రం నుంచి కూడా కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. వీటిలో ఎన్ని గ‌ట్టెక్కుతాయో అన్న‌ది చెప్ప‌లేం. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాగా చేయ‌డం క‌న్నా రెవెన్యూ డివిజ‌న్ల‌ను జిల్లాలుగా ఏర్పాటుచేయాల‌ని కోరుతున్న వ‌ర్గాలు ప్ర‌భుత్వంకు దీనిపై ఒత్తిడి తెచ్చేందుకు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఈ సంద‌ర్భంలో పార్టీల ప్ర‌తినిధులు ఎవ‌రు ఎటు అన్న‌దే ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: