ఉత్తరఖండ్ లోప్రకోపించిన ప్రకృతి - ఉప్పెనలా ఎగిసిపడ్ద విలయం -

హిమాలయ పర్వత సానువుల్లో నెలకొన్న దేవభూమి ప్రాంతంలో ప్రకృతి విలయం పెద్ద పెద్ద మంచు కొండ చరియలు విరిగి పడిపోయిన కారణంగా ధౌలీ గంగ నదికి వరద పోటెత్తి జల ప్రవాహం ఉదృతంగా ఉరకలు వేసి ఉప్పెనగా మారి సమీపంలోని రుషిగంగను జలవాహినిగా మార్చి వరదలు ముంచెత్తాయి. ఆ ప్రవాహం ఊహించలేనంత పరిమాణం పెరిగి ఉదృతికి - రేణి గ్రామం వద్ద ఆ నదిపై నిర్మించిన 12.3 మెగా వాట్ల జలవిద్యుత్తు కేంద్రం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది.

2013 లో జరిగిన జలప్రళయం పునరావృతమైందని జనం అంటున్నారు. విరిగిపడ్డ మంచు చరియలు మరోసారి దేవభూమిలో కన్నెర్ర జేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మంచు చరియలు విరిగిపడి ఆదివారం జలవిలయం సంభవించిన దుర్ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 170 మంది గల్లంతయ్యారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.

చమోలీ జిల్లా జోషిమఠ్‌ సమీపంలో హిమశిఖరం నందాదేవి మంచు చరియలు విరిగిపడి ధౌలీగంగలో పడడం వలననే హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయని, వరద ఉద్ధృతికి ఏకంగా జల విద్యుత్కేంద్రం కొట్టుకుపోగా, మరొకటి పాక్షికంగా ధ్వంసమయ్యిందని, 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ కేంద్రం ప్రవాహం ధాటికి కొట్టుకుపోయిందని తెలుస్తుంది.

ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసు కోగా రాత్రి 8.00 గంటల సమయానికి ధోలిగంగ ఋషిగంగ నదులు వరదతో పోటెత్తి వచ్చి అలకనంద సంగమం అవటములో ఈ మూడు నదుల తీరాలు ఒరుసు కొని ఒక్కసారిగా ప్రవాహం కొన్ని రెట్లు పెరిగి పెను ఉప్పెనతో కలసి, భూమ్యాకాశాలు సంగమించాయన్న తీరును తలపించాయి. ప్రకృతి ప్రళయకాల శివునిలా నాట్యం చేసింది.

సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అలకనంద, ధౌలీగంగ, ఋషిగంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ మహావిపత్తు చోటు చేసుకుంది. గంగానదికి ఉపనదులైన ఋషిగంగ ధౌలీగంగలో కలిసి అనంతరం ఈ రెండూ అలకనందలో మమేకమవుతాయి. ధౌలీగంగలో సాధారణ నీటి మట్టానికి మించి మూడు మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తోంది.

తపోవన్‌ - రైనీ ప్రాంతంలో ఎన్‌టీపీసీ ఏర్పాటుచేసిన తపోవన్‌-విష్ణుగద్‌ 480 మెగావాట్‌ల జలవిద్యుత్తు కేంద్రంలోకి నీరు చొచ్చుకెళ్లింది. ‘దీంతో అందులో పనిచేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. రైనీ గ్రామం వద్ద డ్యామ్ కూడా కూలిపోగా, గ్రామం పూర్తిస్థాయిలో మునిగి పోయింది.” అని ఉత్తరాఖండ్ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఆచూకి తెలియని వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పవర్ ప్లాంట్‌ కు సంబంధించిన సొరంగం పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా వరదనీరు ప్రవేశించడంతో కార్మికులు నీటిలో ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరిలో 16 మందిని ఐటీబీపీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రక్షించాయి.

సొరంగాల్లో మట్టి పూడుకు పోవడం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే, ఇక్కడ ఎంత మంది పని చేస్తున్నారన్న దానిపై ఆ ప్రాజెక్టు అధికారులు స్పష్టమైన వివరాలు చెప్పలేక పోవడంతో గల్లంతయిన వారి సంఖ్య మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయి. 250 మీటర్ల పొడవు ఉన్న ఆ సొరంగంలోకి జవాన్లు అతి కష్టం మీద 150 మీటర్ల వరకు వెళ్ల గలిగారు. అయితే ఎవరి ఆచూకీ వారికి లభించ లేదు. అనుకోకుండా వచ్చిన ఈ ప్రకృతి విపత్తుతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఎంత మంది గల్లంతయ్యారో? ఎంత మంది చనిపోయారో? కూడా అధికారులకు లెక్క తెలియడం లేదు.

ప్రమాదం జరిగిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు అందించేందుకు వివిధ దళాలు రంగంలో దిగాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. సైన్యానికి చెందిన నాలుగు కాలమ్స్‌ జవాన్లు (ఒక్కో కాలమ్‌లో వంద మంది సైనికులు ఉన్నారు) మొత్తంగా 600 మందికిపైగా సైనికులు రంగంలొకి దిగి నిరంతర సేవలు అందిస్తున్నారు.

ప్రకృతి విపత్తులు ఉత్తారాఖండ్ రాష్ట్రానికి సర్వసాధారణం కాగా,  2013వ సంవత్సరంలో భారీ జలవిలయం సంభవించింది. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి నాడు వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దాదాపు 5,700 మంది పైగా మృత్యువాత పడి ఉంటారని నాడు ప్రభుత్వం అంచనా వేసింది. గ్రామాలకు గ్రామాలు పలు వంతెనలు, రహదారులు నామరూపాలు లేకుండా  కొట్టుకుపోయాయి. నాడు “చార్‌ధాం యాత్ర మార్గం” లో 3లక్షల మంది పైగా ప్రజలు చిక్కుకుపోయారు. ఇది చరిత్ర మరవని దారుణ జల విలయంగా భావిస్తారు.

ఇప్పుడు కూడా ఆ ప్రళయాన్ని గుర్తుచేస్తూ హరిద్వార్ జిల్లాలోని ప్రజలను కూడా అధికారులు అలర్ట్ చేశారు. ముఖ్యంగా గంగ దాని ఉపనదుల నదీ పరివాహన ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చమోలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యశ్వంత్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం వరద ముప్పుతో చాలా నష్టం వాటిల్లిందని చెప్పారు.  ఎంతమంది చనిపోయారో చెప్పలేక పోతున్నామని అన్నారు.

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ సమీక్ష నిర్వహించారు. వరదముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక కార్యకలాపాలు చేపట్టాలని అధికారుల నాదేశించారు. గంగానదీ పరీవాహక ప్రాంతాలవద్ద అప్రమత్తగా ఉండాలని కేంద్రం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌ ఘటనకు గల కారణాలపై అధ్యయనం చేసేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. డెహ్రాడూన్‌లోని "వాదియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ" కి చెందిన హిమానీనద శాస్త్రవేత్తలతో కూడిన రెండు బృందాలు సోమవారం ఉదయం చమోలీ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నాయి. ఒక బృందంలో ఇద్దరు, మరో బృందంలో ముగ్గురు శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారని ఆ సంస్థ  డైరెక్టర్‌ కాలాచంద్‌ సైన్‌ ఆదివారం వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: