పాగా వేసేందుకు ఉత్తమ్ ... పట్టు కోసం జగదీష్ ప్రయత్నం

B Sridhar Yadav

హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో తిరిగి పాగావేయడం ద్వారా తన పట్టు నిరూపించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుండగా , ఎట్టి పరిస్థితుల్లోను  సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను గెలిపించుకుని తన మంత్రి పదవిని  కాపాడుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుకున్నారు . ఇటీవల జరిగిన  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ ఘన విజయం సాధించించింది  . ఉప ఎన్నిక ఫలితమే ఈ రెండు మున్సిపాలిటీల్లో రిపీట్ అవుతుందని టీఆరెస్ నాయకత్వం ధీమాగా ఉంది .

 

 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెల్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి , అనంతరం నల్గొండ లోక్ సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెల్సిందే . దాంతో ఉత్తమ్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు . ఉత్తమ్ రాజీనామా తో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి పోటీ చేయగా , అధికార టీఆరెస్ తరుపున అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన సైదిరెడ్డి కి పార్టీ అధిష్టానం మరొక అవకాశాన్ని కల్పించింది .

 

సైదిరెడ్డి , ఉత్తమ్ పద్మావతిపై భారీ మెజార్టీ తో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు . అయితే సైదిరెడ్డి కి  ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల రూపం లో మరోసారి పరీక్ష ఎదురుకానుంది . హుజూర్ నగర్ , నేరేడుచర్ల స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలించాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం ఆయనపై పెట్టింది . ఇక హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఉత్తమ్ తన భుజస్కందాలపై వేసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు .

 

ఈ రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ద్వారా, హుజూర్ నగర్ నియోజకవర్గం లో   తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని ఆయన ఆరాటపడుతుండగా ...  ఇక జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా జగదీష్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు . చూడాలి మరి హుజూర్ నగర్ , నేరేడు చర్ల ఎవరి ఖాతా చేరుతాయో ..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: