అదే కోరికతో ఇండస్ట్రీకి వచ్చా.. 'ప్రియదర్శి...!
అసలు కమెడియన్ అవుదామని ఫిల్మ్ ఇండస్ట్రీకి రాలేదట ప్రియదర్శి. అప్పట్లో కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లా ఊహించుకుని విలన్ గా వాళ్ళు సంపాదించుకున్నంత క్రేజ్ ను సంపాదించుకోవాలని వచ్చాడట. ప్రియదర్శి మొదటి రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ రావడంతో కేవలం అవకాశాల్లేక పెళ్లిచూపులు సినిమా చేశాడట. అది తన జీవితాన్ని మార్చేస్తుందని కలలో కూడా ఊహించలేదంటున్నాడు ప్రియదర్శి. మరీ ముఖ్యంగా తనను కమెడియన్ గా మార్చేస్తుందని అస్సలు అనుకోలేదన్నాడు.
"పెళ్లిచూపులు సినిమా నా కెరీర్ ను మార్చేసింది. అందులో నాతో కామెడీ చేయించారు. ఏదో ఒక ఛాన్స్ వచ్చిందిలే అనుకొని చేశా. అప్పటికి నాకు పనిలేదు, తినడానికి తిండి లేదు. అందుకే చేశా. కానీ ఆ సినిమాలో నా పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యా." నిజానికి పెళ్లిచూపులు సినిమాలో తను చాలా సీరియస్ గా నటించానని, ఎక్కడా నవ్వలేదని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. ఈ విషయం "పెళ్ళి చూపులు" చూసిన అందరికి తెలుస్తుంది. అప్పటికే విలన్ గా చేసిన అనుభవం ఉండడంతో అదే సీరియస్ నెస్ ను చూపించానని, కానీ అదే కామెడీగా మారి థియోటర్స్ లో సినిమా చూస్తూ అందరూ నవ్వుతుంటే తనకు ఆశ్చర్యం వేసిందన్నాడు. ఇక అప్పట్నుంచి తనకు కామెడీ పాత్రల వల్లే ఎక్కువగా అవకాశం వస్తుందని చెప్పాడు.